బాలీవుడ్‌ వివాదాస్పద నిర్మాత ఏక్తాకపూర్ మరోసారి వార్తల్లో నిలిచింది. అలనాటి బాలీవుడ్‌ హీరో జితేంద్ర వారసుడిగా సినీ రంగానికి పరిచయం అయ్యింది ఏక్తా. నిర్మాతగా ఇండస్ట్రీలో తనదైన మార్క్ చూపిస్తున్న ఈ భామ ఎక్కువగా బోల్డ్‌ కంటెంట్‌ ఉన్న కథలను మాత్రమే ఎంచుకుంటుంది. దీంతో తరుచూ ఏక్తా వ్యవహారం, సినిమాలు బాలీవుడ్‌లో వివాదాస్పదమవుతుంటాయి. తాజాగా మరోసారి తన నిర్మాణంలో తెరకెక్కిన ఓ ప్రాజెక్ట్‌ కారణంగా చిక్కుల్లో పడింది ఏక్తా  కపూర్.

ఆల్ట్ బాలాజీస్‌ బ్యానర్‌పై ఏక్తా రూపొందించిన తాజా వెబ్‌ సిరీస్‌ XXX. మరోసారి తనదైన స్టైల్‌లో బోల్డ్ కంటెంట్‌ తో రూపొదించిన ఈ సిరీస్‌లో భారతీయుల మనోభావాలను కించపరిచే వ్యాఖ్యలు ఉన్నాయని, హిందూ దేవతలను అవమానకరంగా చూపించారంటూ మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌లో కంప్లయింట్ నమోదైంది. దీంతో ఏక్తాపై ఐపీసీ 294, 298 సెక్షన్లతో పాటు ఐటీ యాక్ట్ కింద కేసులు నమోదు చేశారు.

అంతేకాదు ఈ సిరీస్‌లోని ఓ సన్నివేశంలో ఆర్మీ డ్రెస్‌ను కూడా అవమానకరంగా చిత్రీకరించారన్న ఆరోపణలు కూడా ఉన్నాయి. దీనిపై కూడా గుర్‌గావ్‌లోని పాలమ్‌ విహార్‌ పోలీస్ట్‌ స్టేషన్‌లో కంప్లయింట్ నమోదైంది. ఏక్తాతో పాటు వెబ్‌ సిరీస్‌కు దర్శకత్వం వహించిన పంఖుడి రోడ్రిగ్స్‌, స్క్రీన్‌ రైటర్‌ జెస్సికా ఖురానాపై కూడా కేసు నమోదు చేసినట్లు ఇండోర్‌ లోని అన్నపూర్ణ పోలీస్‌ స్టేషన్‌ ఇన్స్‌పెక్టర్ వెల్లడించారు.