టైటిల్ చూసి బాలయ్య సినిమాలకు గుడ్ బై చెప్తున్నారని అనుకుంటున్నారా..? అసలు విషయం అది కాదండీ.. హీరోగా ఎన్నో సినిమాలు చేసిన బాలయ్య రాజకీయంగా ఎంత బిజీగా ఉన్నా సినిమాలు వదలలేదు. ఇకపై కూడా ఆయన సినిమాలకు దూరం కారు.

కానీ బయట బ్యానర్ లతో సినిమాలు చేయకూడదని నిర్ణయించుకున్నారట. నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం తన తండ్రి బయోపిక్ లో నటిస్తోన్న సంగతి తెలిసిందే. ఈ సినిమా రెండు భాగాలుగా ప్రేక్షకుల ముందుకు రానుంది.

ఈ సినిమాను బాలయ్య తన సొంత నిర్మాణ సంస్థ NBK ఫిలిమ్స్ పై నిర్మిస్తున్నారు. తన తదుపరి సినిమాలు కూడా ఇదే బ్యానర్ లో నిర్మించాలనేది బాలకృష్ణ ఆలోచన. అయితే వివి వినాయక్ దర్శకత్వంలో చేయబోయే సినిమాను మాత్రం సి.కళ్యాణ్ నిర్మిస్తారు. ఇందులో కూడా NBK ఫిలిమ్స్ ని భాగస్వామ్యం చేయనున్నారు బాలయ్య.

బయట నిర్మాతలతో బాలయ్య చేయబోయే ఆఖరి సినిమా ఇదేనని అంటున్నారు. తన కొడుకు మోక్షజ్ఞ సినిమాల్లోకి పూర్తిస్థాయిలో వచ్చేలోపు బాలయ్య తన నిర్మాణ సంస్థను బలంగా ఎస్టాబ్లిష్ చేయాలని అనుకుంటున్నారు.