టాలీవుడ్ తప్పితే తమిళ, కన్నడ ఫిల్మ్ ప్రొడ్యూసర్స్ తమ ఆందోళనను మరింత ఉధృతం చేస్తున్నారు. ఇప్పటివరకు సినిమా లను మాత్రమే బంద్ చేయగా, ఇకపై షూటింగ్‌లు సైతం నిలిపివేయాలని నిర్ణయించారు. మార్చి 16 నుంచి షూటింగ్‌లు, పోస్ట్‌ ప్రొడక్షన్‌ పనులను నిలిపివేయాలని భావించింది తమిళ్‌ ఫిల్మ్‌ ప్రొడ్యూసర్స్‌ కౌన్సిల్. మొత్తం ఆరు డిమాండ్లతో ఈ ఆందోళన కార్యక్రమాన్ని ప్లాన్ చేసింది. థియేటర్‌ యజమానులు ఏ విధంగా టికెట్‌ ధరలను నిర్ణయిస్తారన్నది ప్రొడ్యూసర్స్‌ కౌన్సిల్‌ ప్రశ్న. టికెట్‌ ధర పెంచే అధికారం నిర్మాతకు మాత్రమే ఉండాలని, థియేటర్లు కేవలం కమిషన్‌ పద్ధతిలో మాత్రమే సినిమాలను విడుదల చేసుకోవాలని పేర్కొంది.

క్యూబ్‌, యూఎఫ్‌వోలు ఇక నుంచి వర్చువల్‌ ప్రింట్‌ ఫీజుని వసూలు చేయకూడదని, టికెట్‌ ధరలను సరళీకరించాలన్నది ప్రధాన పాయింట్స్. ఇక ఆన్‌లైన్‌ బుకింగ్‌ ఛార్జీలను తగ్గించడం, అన్ని థియేటర్లలో టికెట్లను కంప్యూటరైజ్డ్‌, చిన్న సినిమాల ప్రదర్శనకు తగిన థియేటర్లు ఉండేలా చర్యలు, ప్రొడక్షన్‌ వ్యయాన్ని నియంత్రించడం వంటివి కీలకమైనవి. సర్వీస్‌ ప్రొవైడర్ల వైఖరిని నిరసిస్తూ ఇటీవల తెలుగు రాష్ట్రాలతో పాటు తమిళనాడు, కర్ణాటక, కేరళ రాష్ట్రాల్లో థియేటర్లు బంద్‌ పాటించిన సంగతి తెలిసిందే! ఐతే, డిజిటల్‌ కంటెంట్‌ ప్రొవైడర్లు ఛార్జీలను కాస్త తగ్గించడంతో శుక్రవారం నుంచి తెలుగు రాష్ట్రాల్లో సినిమాలు యథావిధిగా ప్రదర్శిస్తున్నా..కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల్లో మాత్రం బంద్‌ కొనసాగుతోంది.