ఆర్టికల్ 370 రద్దుపై కేంద్రప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో ఏకీభవించని పాక్ ప్రభుత్వం అసహనాన్ని వ్యక్తం చేస్తూనే ఉంది. పాక్ ప్రభుత్వ తీరుతో భారత ప్రభుత్వంతో పాటు ప్రజలు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. ఇలాంటి సమయంలో పాకిస్థాన్ కి చెందిన ప్రముఖ పారిశ్రామిక వేత్త ఇంట్లో జరిగిన పార్టీలో పాల్గొన్న ప్రముఖ సింగర్ మికా సింగ్ పై పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

కరాచీలో షో చేసిన ఆయనపై తాజాగా బ్యాన్ విధిస్తూ ఆల్ ఇండియా సినీ వర్కర్స్ అసోసియేషన్ సంచలన నిర్ణయాన్ని తీసుకుంది. పాక్ మాజీ అధ్యక్షుడు ముషారఫ్ బంధువు ఇంట్లో జరిగిన వేడుకలో కచేరీ కార్యక్రమాన్ని నిర్వహించారు మికా సింగ్.

ప్రస్తుతం ఉన్న ఇలాంటి పరిస్థితుల నేపధ్యంలో రెండు దేశాల మధ్య సంబంధాలు సరిగ్గా లేని సమయంలో మికా సింగ్ పాక్ కి వెళ్లి షో నిర్వహించడాన్ని ఆల్ ఇండియా సినీ వర్కర్స్ అసోసియేషన్ తప్పుపట్టింది.

ఈ క్రమంలో అతడిపై బ్యాన్ విధించింది. అతడితో కలిసి పని చేయడానికి ఒప్పందం చేసుకున్న అన్ని సినీ నిర్మాణ సంస్థలు, మ్యూజిక్ కంపనీలు అతడిని తమ ప్రాజెక్ట్ ల నుండి తప్పించాలని నిర్ణయించుకున్నాయి.

మికా సింగ్ తో కలిసి భారత్ లో ఎవరూ పని చేయకూడదని నిర్ణయించారు. ఈ నిర్ణయాన్ని కాదని మికాతో కలిసి పని చేస్తే చర్యలు తప్పవని అసోసియేషన్ అధ్యక్షుడు సురేష్ శ్యాంలాల్ గుప్తా తేల్చిచెప్పారు.