పాకిస్తాన్ నటుడు ఫవాద్ ఖాన్ పై లాహోర్ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైంది. దీనికి కారణం అతడి భార్య అని తెలుస్తోంది. అతడి భార్య చేసిన పనికి ఫవాద్ పై కేసు నమోదు చేశారు పోలీసులు.

వివరాల్లోకి వెళితే.. ఫవాద్ కూతురికి యాంటీ పోలియో చుక్కలు వేయడానికి వైద్యఆరోగ్యశాఖ బృందం అతని ఇంటికి వెళ్లగా.. తమ కుమార్తెకి పోలియో చుక్కలు అవసరం లేదని ఫవాద్ ఖాన్ భార్య అడ్డుకొంది. డ్రైవర్ తో కలిసి వైద్యబృందం పట్ల అనుచితంగా ప్రవర్తించింది.

దీంతో వారు లాహోర్ పోలీసులుకు ఫిర్యాదు చేయగా.. వారు ఫవాద్ ఖాన్ పై కేసు నమోదు చేశారు. ఫవాద్ సంఘటన జరిగినప్పుడు ఇంట్లో లేరు. ప్రస్తుతం అతడు పాకిస్తాన్ సూపర్ లీగ్ ఈవెంట్ నిమిత్తం దుబాయ్ లో ఉన్నారు.

పోలియో కేసులు అత్యధికంగా నమోదయ్యే దేశాల్లో ఒకటైన పాకిస్తాన్ లో.. అక్కడి చట్టాల ప్రకారం పోలియో చుక్కలు వేయించని తల్లితండ్రులకు జరిమానా విధించడంతో పాటు రెండేళ్లు జైలు శిక్ష కూడా విధిస్తారు. గతంలో ఫవాద్ 'ఖుబూసూరత్', 'యే దిల్ హై ముష్కిల్' వంటి సినిమాల్లో నటించారు.

పుల్వామా దాడి నేపధ్యంలో పాక్ నటులపై బాలీవుడ్ బ్యాన్ విధించింది. ఈ క్రమంలో అతడు బాలీవుడ్ కి దూరం కానున్నాడు.