Asianet News TeluguAsianet News Telugu

ఫన్ .. సంక్రాంతి విన్ (ఎఫ్‌2 రివ్యూ)

కామెడీ సినిమా, అదీ ట్రెండ్ లో వెనకబడ్డ వెంకీ, వరుణ్ తేజలతో...ప్రమోషన్ కూడా పెద్దగా లేదు,డైరక్టర్ సెకండాఫ్ కూడా లేకుండా షూటింగ్ కు వెళ్లిపోయారని నిర్మాత దిల్ రాజే స్వయంగా చెప్పారు. డైరక్టర్ సైతం తొలి చిత్రం తప్పించి  మెగా బ్లాక్ బస్టర్ హిట్ ఇప్పటిదాకా ఇవ్వలేదు.  ఈ నేపధ్యంలో ఈ సినిమా సంక్రాంతికి వర్కవుట్ అవుతుందా...అనే సందేహాలు సాధారణ సినీ ప్రేక్షకుడిలో కలిగాయి. అయితే ఇవన్నీ ఆలోచించకుండా దిల్ రాజు లాంటి పెద్ద నిర్మాత ధైర్యం చేయడు కదా...అని జనం ధైర్యం  చేసారు. ఓపినింగ్స్ బాగున్నాయి. ఈ నేఫధ్యంలో  ఈ చిత్రం కథేంటి...వెంకటేష్ మళ్లీ పాత రోజుల్లోకి తీసుకెళ్లి నవ్వించాడా...సినిమా సంక్రాంతికి నిలుస్తుందా వంటి విషయాలు రివ్యూలో చూద్దాం.

F2 MOVIE REVIEW
Author
Hyderabad, First Published Jan 12, 2019, 11:29 AM IST

--సూర్య ప్రకాష్ జోశ్యుల

కథేంటి

వెంకీ (వెంకటేష్) ఒక  ఎంఎల్ఏ (ర‌విబాబు) దగ్గర పీఏగా ప‌ని చేస్తూ ... హారిక (త‌మ‌న్నా)ను  పెళ్లాడుతాడు. అప్పటినుంచీ వెంకీ జీవితం మారిపోతుంది. పెళ్లాం, అత్తగారు కలిసి వెంకీని  చెప్పు చేత‌ల్లో పెట్టుకునేందుకు స్కెచ్ లు వేస్తూంటారు. దాంతో అతనికి ప్రస్టేషన్ స్టార్ట్ అయ్యిపోతుంది. పెళ్లి,పెళ్ళాం అంటే ఓ రకమైన వైరాగ్యం పుట్టుకొస్తుంది. అదే సమయంలో వెంకీ భార్య చెల్లెలు హ‌నీ(మెహ‌రీన్‌) తన ఇంటికి వ‌స్తుంది . ఆమెతో వ‌రుణ్ యాద‌వ్‌(వ‌రుణ్‌తేజ్‌)ప్రేమలో పడి పెళ్లి కు రెడీ అవుతున్నాడని తెలుసుకుని , ఆపటానికి ప్రయత్నిస్తాడు. 

తన అనుభవాలు చెప్పి..తనలాగ బలి అవ్వద్దు అని హెచ్చరిస్తాడు. కానీ వరుణ్ కు అవేమీ బుర్రకు ఎక్కక పెళ్లి చేసుకుంటాడు. ఆ తర్వాత అతనూ ప్రస్టేటెడ్ మొగాళ్ల బ్యాచ్ తో కలిసిపోతాడు. అప్పుడు వీళ్లకు మరో వ్యక్తి  (రాజేంద్రప్రసాద్ ) పరిచయమై...మీరిద్దరూ ఇలా ఉంటే మీ పెళ్లాలు ఇలాగే బిహేవ్ చేస్తారని, ఎక్కడికైనా వెళ్లిపోతే విలువ తెలిసొచ్చి.దారికి వస్తారని సలహా ఇస్తాడు. దాంతో వీళ్లు యూపర్ వెళ్లి ఎంజాయ్ చేయటం మొదలెడతారు.  చక్కగా యూరప్ లో ఎంజాయ్ చేస్తున్న సమయంలో ఊహించ‌ని ట్విస్టు.

తమ మొగుళ్లను  వెతుక్కుంటూ పెళ్లాలు యూరప్ లో ప్రత్యక్ష్యమవుతారు. అంతేకాదు అక్క‌డికి వ‌చ్చిన ప్ర‌కాష్ రాజ్ కొడుకులు స‌త్యం రాజేష్, సుబ్బ‌రాజుల‌ను 10రోజుల్లోనే పెళ్లాడేందుకు ఆ అక్కచెళ్ళిలిద్దరూ  ప్లాన్ చేస్తారు. దాంతో మొగుళ్ల‌కు టార్చ‌ర్ మొదలవుతుంది. అక్కడ నుంచి అసలు కథ ప్రారంభం అవుతుంది. అప్పుడు ఈ భర్తలిద్దరూ ఏం చేసారు. పెళ్లాల మళ్లీ పెళ్లి చేసుకోవాలనుకోవటం వెనుక అసలు ఆలోచన ఏమిటి...తమ పెళ్లాళ్లకు బుద్ది చెప్దామని యూరప్ వచ్చిన ఆ భర్తలు విజయం సాధించారా లేక పెళ్లాలదే పై చేయి అయ్యిందా...చివరకు ఎవరి తప్పు వాళ్లు ఎలా తెలుసుకుని ఒకటవుతారు..  అన్న‌దే మిగతా కథ.  

ఓల్డ్ సెటప్..న్యూ గెటప్

పాత సక్సెస్ ఫుల్ ఫార్ములా కథలు పట్టుకుని ఫారిన్ లొకేషన్స్   పెట్టి... కొత్త హిట్స్ కొట్టవచ్చు అంటూ బాలీవుడ్ లో ఆల్రెడీ రోహిత్ శెట్టి ప్రూవ్ చేసాడు. ఇప్పుడిప్పుడే తెలుగులోనూ ఆ ట్రెండ్ ని పట్టుకుని  అనీల్ రావిపూడి కొనసాగిస్తున్నాడు. కేవలం కామెడీ ఎపిసోడ్స్ చుట్టూ కథ,కథనం అల్లుకుని..స్టార్స్ ని పెట్టుకుని సరదాగా సినిమా లాగేస్తున్నాడు. సినిమా చూసాక..ఏమి చూసాం అని ఆలోచిస్తే కథ తట్టకపోవచ్చు కానీ ..కాస్సేపు నవ్వుకున్నాం అని సమాధానం వస్తోంది. దాంతో అదిరిపోయే సినిమాలు రాకపోయినా..అలరించే కామెడీలు రెడీ చేసేస్తున్నాడు. అలా ఓల్డ్ సెటప్ తో న్యూ గెటప్స్ దిగిన కొత్త సీసాలో పాత సారాయి లాంటి సినిమా ఎఫ్‌2. ఈ సినిమా గతంలో వచ్చిన `క్షేమంగా వెళ్లి లాభంగం రండి`  ని కాసేపు గుర్తు చేస్తే...`సందడే సందడి`  ని ఇంకాసేపు గుర్తు చేస్తుంది. అయితేనేం నవ్విస్తుంది. 

ఫస్టాఫే ఫన్..సెకండాఫ్ ప్రస్టేషన్

ఫస్టాఫ్ బాగా నవ్విస్తుంది. సెకండాఫ్..డైరక్టర్ స్వయంగా మనను పట్టుకుని కితకితలు పెట్టాల్సి వచ్చింది. ఎలాగైతేనేం నవ్వుకున్నాం కదా అనిపిస్తుంది.  దాంతో ఫస్టాఫ్ హీరోల ప్రస్టేషన్ అయితే సెకండాఫ్ అక్కడక్కడా మనకు ప్రస్టేషన్ కలుగుతుంది. దానికి తోడు కథ అసలు సమస్యలోకి రావటానికి చాలా సమయం పట్టడంతో, సెకండాఫ్ లాగిన ఫీలింగ్ వస్తుంది. ఎప్పుడైతే భార్యలు వచ్చి యూరప్ లో ట్విస్ట్ ఇచ్చారో అక్కడ కధలో స్పీడు రావాలి. కానీ అది జరగలేదు. 

భార్య బాధితుల సంఘాలే ప్రపంచ వ్యాప్తంగా ఉన్నాయి. మనకు సినిమాల్లోనూ, కథల్లోనూ ఆ పాత్రలు పరిచయమే. చాలా మందికి నిత్యానుభవమే. అదే పాయింట్ ని ఈ సినిమాకు బేస్ చేసుకున్నాడు. ముఖ్యంగా అత్తారింటిలో వెంక‌ి చూపించే ఫ్ర‌స్ట్రేష‌న్ చూసి నవ్వు వస్తుంది. అలాగే సిట్యులేషన్ కామెడీ సీన్స్ ఈ సినిమాలో బాగా వర్కవుట్ అయ్యాయి.    అయితే స్క్రీన్ ప్లే లో స్పీడు లేదు. వరస పెట్టి సీక్వెన్స్ లు చూస్తున్న ఫీల్ వస్తుంది. 

కథ,కథనం

సెకండాఫ్ రాసుకోకుండా షూటింగ్ కు వెళ్లారని దిల్ రాజు చెప్పిన  విషయం ఈ సినిమా చూస్తే నిజమే అనిపిస్తుంది. కామెడీని పిండటంలో ర‌చ‌యిత‌గా,డైరక్టర్ గా  అనిల్‌రావిపూడి బాగా స‌క్సెస్ అయ్యాడు.అయితే ఎఫ్‌2 చాలా చిన్న క‌థ‌. సినిమా మొత్తం ఫస్ట్ పావుగంటలోనే పూర్తిగా అర్థ‌మైపోతుంది. ట్విస్టులు, టర్న్ లు లేవు. ప్లాట్ గా నడిచిపోయింది. 

వింటేజ్ వెంకీ

వెంకటేష్ తన అభిమానులకు మల్లేశ్వరి, నువ్వు నాకు నచ్చావ్ రోజుల్లోకి తీసుకెళ్లాడు. ఆయన క్యారక్టర్ సినిమాకు హైలెట్. వరుణ్ తేజ కు తెలంగాణా యాస పెట్టకుండా ఉండి ఉంటే ఇంకా బాగుండేది. త‌మ‌న్నా, మెహ్రిన్ లది మామూలు భార్యలు పాత్రలే.   ర‌ఘుబాబు, రాజేంద్ర‌ప్ర‌సాద్‌, ప్ర‌కాష్‌రాజ్‌, నాజ‌ర్‌లు అన్న‌పూర్ణ‌, వై.విజ‌య వీళ్లితా శక్తి మేరకు నవ్వులు పంచారు. 

టెక్నికల్ గా ...

దేవిశ్రీ ప్ర‌సాద్ పాటలు ఎందుకనో అంత గొప్పగా లేవు. కెమెరా వర్క్ బాగుంది.  క‌ల‌ర్‌ఫుల్‌గా సినిమా ఉండేలా ప్రతీ ఫ్రేమ్ జాగ్రత్తగా డిజైన్ చేసుకున్నారు. సెకండాఫ్ ని ఎడిటర్ గారు మరింత ట్రిమ్ చేయచ్చేమో. నిర్మాణ విలువ‌లు బాగున్నాయి. మిగతా డిపార్టమెంట్ లు ఈ సినిమాని కలర్ ఫుల్ గా తీర్చి దిద్దటంలో సక్సెస్ అయ్యాయి.

ఫైనల్ థాట్

పాత కథని కొత్తగా చెప్పాలన్న పాత  రూల్ ని అనీల్ రావిపూడి గుర్తించుకుని ఉంటే సినిమా వేరే విధంగా ఉండేది.  అయినా నవ్వుకోవటానికి ఈ సినిమా అవకాసమిచ్చి, ఫ్యామిలీలను ఆహ్వానిస్తుంది. సంక్రాంతికి విన్నర్ గా నిలుస్తుంది. 

Rating: 3/5

ఎవరెవరు

నటీనటులు: వెంకటేష్‌, వరుణ్‌తేజ్‌, తమన్నా, మెహరీన్‌, రాజేంద్రప్రసాద్‌, ప్రకాష్‌రాజ్‌, ఝాన్సీ, ప్రియదర్శి, అనసూయ, బ్రహ్మాజీ, రఘుబాబు, అన్నపూర్ణ, వై.విజయ, నాజర్‌ తదితరులు

సంగీతం: దేవిశ్రీ ప్రసాద్‌

సినిమాటోగ్రఫీ: సమీర్‌రెడ్డి

ఎడిటింగ్‌: బిక్కిని తమ్మిరాజు

నిర్మాత: దిల్‌రాజు

దర్శకత్వం: అనిల్‌ రావిపూడి

సంస్థ: శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్‌

విడుదల: 12-01-2019

Follow Us:
Download App:
  • android
  • ios