ఈ సంవత్సరం తెలుగులో సూపర్ హిట్టైయిన తొలి చిత్రం ‘ఎఫ్ 2’. వెంకటేష్, వరుణ్ తేజ్ హీరోలుగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం సంక్రాంతి కానుకగా విడుదలై సంచలన విజయం సాధించింది. అంతేకాదు రూ.120 కోట్ల గ్రాస్,రూ.80 షేర్‌ను రాబట్టి ట్రేడ్ ని షాక్ ఇచ్చింది. సినిమా ప్రారంభం  నుంచి లాస్ట్ షాట్  వరకు ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించడంలో అనిల్ రావిపూడి సక్సెస్ అవ్వటం కలిసివచ్చింది.

ఈ నేపధ్యంలో ...తెలుగులో బంపర్ హిట్టైన ఈ సినిమాను హిందీలో రీమేక్ ప్లాన్ చేసారు. హిందీలో ఈ సినిమాను బోనీ కపూర్‌తో కలిసి దిల్ రాజు నిర్మిస్తున్నాడు. హిందీలో కామెడీ సినిమాలకు కేరాఫ్ అడ్రస్‌గా మారిన అనీస్ బజ్మీ ఈ సినిమాను డైరెక్ట్ చేస్తున్నాడని వినికిడి.   అయితే ఈ లోగా ఓ ట్విస్ట్ పడింది. 

నిన్నటి నుండి ఈ చిత్రం హిందీ డబ్బింగ్ వర్షన్ యూట్యూబ్ లో పెట్టారు. ఆదిత్య మ్యూజిక్& ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ ఈ చిత్ర హిందీ డబ్బింగ్ వర్షన్ ని కొద్దిసేపటి క్రితం యూట్యూబ్ లో అప్ లోడ్ చేయడం జరిగింది. దీనితో హిందీ ప్రేక్షకులుకూడా వెంకీ, వరుణ్ ల ఫన్ అండ్ ఫ్రస్ట్రేషన్ చూసి ఎంజాయ్ చేయబోతున్నారు.  

అంతవరకూ బాగానే ఉంది కానీ..ఇదే సినిమాని ఇప్పుడు అక్కడ రీమేక్ చేయాలంటే యూట్యూబ్ లో చూసేసిన జనం మళ్లీ థియోటర్ కు వచ్చి చూస్తారా...ఇది దిల్ రాజుకు దెబ్బేనా.. లేక రీమేక్ నిర్ణయం మానుకున్నారా తెలియాల్సి ఉంది.