చిత్రం: మహానటి 
నటీనటులు: కీర్తి సురేష్, సమంత, దుల్కర్ సల్మాన్, విజయ్ దేవరకొండ తదితరులు 
సంగీతం: మిక్కీ జె మేయర్ 
సినిమాటోగ్రఫీ: డానీ సంచేజ్-లోపేజ్
ఎడిటింగ్: కోటగిరి వెంకటేశ్వరరావు 
నిర్మాతలు: అశ్వనీదత్, స్వప్నా దత్మ ప్రియాంక దత్
దర్శకత్వం: నాగ్ అశ్విన్ 
విడుదల తేదీ: మే 9 శుక్రవారం

 

కథ: 
అలనాటి మేటి కథానాయిక సావిత్రి గారి గురించి ఈ తరం ప్రేక్షకులకు పెద్దగా తెలియదనే చెప్పాలి. ఆ కథను జర్నలిస్ట్ మధురవాణి(సమంత) ద్వారా అందరికీ చెప్పే ప్రయత్నం  చేశాడు దర్శకుడు. వెండితెరపై మధురవాణి ఈ కథను ఎలా చెప్పిందో తెలుసుకుందాం!

సావిత్రి బాల్యం: 

చిన్నప్పుడే తండ్రిని కోల్పోయిన సావిత్రి తన తోటి స్నేహితుల తండ్రులను చూస్తూ తన నాన్న కూడా ఉంటే ఇలానే ఉండేవాడేమో అనుకొని తనలో తనే మథనపడేది. తన తల్లితో కలిసి పెదనాన్న ఇంట్లో ఉండే సావిత్రికి పట్టుదల చాలా ఎక్కువ. ఎవరైనా ఇది నీ వల్ల కాదు అంటే అసలు ఒప్పుకునేది కాదు. అసలు వాళ్ళు ఎవరు నా గురించి నిర్ణయం చేయడానికి అంటూ పట్టుదలతో అనుకున్న పనిని సాధించేది. పట్టుదలతో పాటు సహాయం చేసే గుణం కూడా చిన్నప్పటినుండి ఉండేది. తనతో పాటు చుట్టూ ఉన్న వారు కూడా సంతోషంగా ఉండాలని కోరుకునేది.

సినిమాల్లోకి రావడం:

నాట్యం నేర్చుకుంటే బాగా సంపాదించొచ్చు అని సావిత్రి పెదనాన్నకు ఎవరో చెబితే ఈమెను డాన్స్ నేర్చుకోమని ప్రేరేపిస్తాడు. కానీ ఆమెకు ఇష్టం ఉండదు. మొండితనంతో డాన్స్ నేర్చుకుంటుంది. అలా కొన్నేళ్లకు నాటకాల్లో వేషాలు వేయడం మొదలుపెడుతుంది. సినిమాల్లోకి వెళ్తే బాగా డబ్బు వస్తుందని పెదనాన్న కెవి చౌదరి సావిత్రిని మద్రాస్ తీసుకొని వెళ్తాడు. కానీ అవకాశాలు మాత్రం రావు. అదే సమయంలో మొదటిసారిగా జెమినీ గణేషన్.. సావిత్రిని చూస్తాడు. చూసిన రోజే భవిష్యత్తులో పెద్ద స్టార్ అవుతావ్ అని చెబుతాడు. కొన్ని ఫోటోలను కూడా తీస్తాడు. మద్రాస్ నుండి ఊరికి వెళ్ళిపోయిన సావిత్రిని వెతుక్కుంటూ ఓ సినిమా అవకాశం వస్తుంది. ఒక మేనేజర్ సావిత్రిని సినిమాలో నటించమని అడుగుతాడు. ఆ విధంగా ఎల్ వి ప్రసాద్ సినిమాలో ఛాన్స్ దక్కించుకుంటుంది. 

సినిమాల్లో అగ్రస్థానం: 

డైలాగ్స్ సరిగ్గా చెప్పలేకపోవడంతో వచ్చిన అవకాశం చేజారిపోతుంది. ఎల్ వి ప్రసాద్.. నటన నీ వల్ల కాదని అనడంతో పట్టుదలతో నటించి నెగ్గుతుంది. రామారావు, నాగేశ్వరావు  వంటి అగ్ర హీరోల కోసం దర్శకనిర్మాతలు ఎదురుచూస్తుంటే ఆ స్టార్లు మాత్రం సావిత్రి కోసం ఎదురుచూసేవారు. సినిమాలో చేస్తోన్న సమయంలోనే జెమినీ గణేషన్ ను ప్రేమిస్తుంది  సావిత్రి. తనకు పెళ్ళయిన విషయం చెప్పడంతో ఆయనకు దూరంగా ఉంటుంది. కానీ వారి ప్రేమ ఇద్దరినీ ఒకటిగా చేస్తుంది. అలా ఇద్దరూ పెళ్లి చేసుకుంటారు. ఆ విషయాన్ని ఎవరికి చెప్పకుండా దాస్తారు. కొన్నిరోజులకు తెలియడంతో ఇంట్లో ఎవరూ అంగీకరించరు. దాంతో ఇంటి నుండి బయటకు వెళ్లిపోతుంది సావిత్రి. పెళ్ళయిన తరువాత కూడా నటిగా కొనసాగుతుంది. తెలుగు, తమిళ ఇండస్ట్రీలు ఆమెను అగ్ర స్థానంలో నిలబెడుతాయి. 


సావిత్రి జీవితంలో చీకటి కోణం: 

మొదటి నుండి కూడా సావిత్రికి సహాయం చేసే గుణం ఉండడంతో తనకు తెలిసిన వారందరికీ డబ్బులూ నగల రూపంలో సహాయం చేస్తూ వస్తుంటుంది. భర్త జెమినీ గణేషన్ డబ్బుకి  సంబంధించిన విషయాలు చూసుకుంటూ ఉంటారు. ఇద్దరూ టాప్ స్టార్స్ కావడంతో బాగా డబ్బు సంపాదించేవారు. ఒక స్టేజ్ లో జెమినీ గణేషన్ క్రేజ్ తగ్గిపోతుంది. ఆ సమయంలో  భార్యకు క్రేజ్ ఎక్కువవ్వడం, తనను ఎవరూ పట్టించుకోకపోవడంతో అతడి ఈగో హర్ట్ అవుతుంది. ఆ విధంగా ఇద్దరి మధ్య మనస్పర్ధలు చోటు చేసుకుంటాయి. జెమినీ గణేషన్  మరో మహిళతో ఉండడం చూసి తట్టుకోలేని సావిత్రి మద్యానికి బానిస అవుతుంది. భర్తను దూరం చేసుకుంటుంది. కొన్నాళ్లకు తాను నమ్మిన వారు కూడా ఆమెను డబ్బు కోసం మోసం చేస్తారు. ఐటి అధికారులు ఆమె ఇంటిపై దాడి చేసి డబ్బు, నగలు మొత్తం సీజ్ చేస్తారు. ఇద్దరు పిల్లలతో కలిసి ఎన్నో కష్టాలను భరిస్తుంది. కానీ ఏనాడూ కూడా ఆమెలో ధైర్యం చావదు. సినిమాల్లో చిన్న చిన్న వేషాలు వేస్తూ జీవితాన్ని నెట్టుకొస్తుంది. కొన్నాళ్ళకు షుగర్ వ్యాధితో మంచాన పడుతుంది. 18 నెలల పాటు కోమాలో ఉండి కొన్నాళ్ళకు మరణిస్తుంది. 


ఇలా సావిత్రి జీవితంలో ప్రతి ఒక్క అంశాన్ని టచ్ చేసిన దర్శకుడు నాగ్ అశ్విన్ ను మెచ్చుకొని తీరాల్సిందే. నేటి తరం వారికి సావిత్రి గొప్పతనాన్ని చెప్పిన అశ్విన్ ను భుజం తట్టి  అభినందించాలి. కీర్తి సురేష్ అద్భుత నటనతో ప్రేక్షకులు మైమరిచిపోతారు. కొన్నిచోట్ల సావిత్రినే చూస్తున్నామా అనే భావన కలుగుతుంది. అంతగా తన పాత్రలో ఇమిడిపోయింది. తన కాస్ట్యూమ్స్, మేకప్ ప్రతిదీ ఎంతో అందంగా ఉంది. జర్నలిస్ట్ మధురవాణిగా సమంత, ఫోటోగ్రాఫర్ గా విజయ్ దేవరకొండ తమ తమ పాత్రలకు పూర్తి న్యాయం చేశారు. ఏఎన్నార్ పాత్రలో నాగచైతన్యను చూడడం ప్రేక్షకులకు ఆనందాన్ని కలిగిస్తుంది. ఎన్టీఆర్ పాత్ర తెరపై ఒక్క ఫ్రేంలో తలుక్కున మెరుస్తుంది. డిజిటల్ టెక్నాలజీ ద్వారా నిజమైన ఎన్టీఅర్ ను ఆ పాత్రలో చూపించడం విశేషం. జెమినీ గనేషన్ పాత్రలో దుల్కర్ సల్మాన్ ఒదిగిపోయాడు. తెలుగు ప్రేక్షకులకు దుల్కర్ పెద్దగా తెలియకపోయినా.. జెమినీ గనేషన్ ఇలానే ఉంటాడేమో అన్నట్లుగా తన నటనతో మెప్పించాడు. అతడి పాత్రలో కొంత నెగెటివ్ షేడ్ కూడా చూపించారు. అలనాటి మహానటుడు ఎస్.వి.రంగారావు పాత్రలో మోహన్ బాబు చక్కగా నటించారు. మాయాబజార్ ఎపిసోడ్ లో ఆయన జీవించేశారంతే.. సావిత్రి పెదనాన్నగా రాజేంద్రప్రసాద్ నటన బాగుంది. సావిత్రి ఆసుపత్రిలో ఉన్న రోజుల్లో ఆయన వచ్చి పలకరించే సన్నివేశాలు ఎమోషనల్ గా ఆడియన్స్ కు కనెక్ట్ అవుతాయి. చక్రపాణిగా ప్రకాష్ రాజ్, దర్శకుడు కెవి రెడ్డిగా క్రిష్, ఎల్.వి.ప్రసాద్ పాత్రలో అవసరాల శ్రీనివాస్ ఇలా ప్రతిఒక్కరూ పోటీ పడినటించారు. సినిమాలో పాటలు అద్భుతంగా ఉన్నాయి. ప్రతీదీ సందర్బానుసారంగా ఉంటుంది. 'చివరకు మిగిలేది', 'మహానటి' టైటిల్ సాంగ్ హైలైట్ గా నిలిచాయి. సినిమాటోగ్రఫీ గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. బ్లాక్ అండ్ వైట్, కలర్ వేరియేషన్ చూపిస్తూ సన్నివేశాలను అద్భుతంగా చిత్రీకరించారు. కొన్ని సన్నివేశాల కోసం ఫిల్మ్ ను ఉపయోగించడం మెచ్చుకోవాల్సిన విషయం. ఆర్ట్ డైరెక్టర్ అవినాష్, ప్రొడక్షన్ డిజైన్ శివంలతో కలిసి తోట తరణి వేయించిన సెట్స్ వంక పెట్టలేనివిధంగా వున్నాయి ఎడిటింగ్ వర్క్ బాగుంది. సాయి మాధవ్ బుర్రా రాసిన మాటలు సినిమా స్థాయిని పెంచాయి. అన్ని వర్గాల ప్రేక్షకులు తప్పక చూడాల్సిన అద్భుత కావ్యమిది. 

'మహానటి' రేటింగ్: 3.5/5