టీమిండియా క్రికెట్ కెప్టెన్ విరాట్ కోహ్లి, బాలీవుడ్ బ్యూటీ అనుష్క శర్మ, మూడుముళ్ల బంధంతో ఏకమయ్యారు. సోమవారం వీళ్ల వివాహం ఇటలీలో ఘనంగా జరిగింది. కుటుంబ సభ్యులు, స్నేహితులు, అతి కొద్ది మంది అతిథుల మధ్య పెళ్లి వేడుక జరిగింది. త్వరలో ఢిల్లీ, ముంబైలో గ్రాండ్ గా వెడ్డింగ్ రిసెప్షన్ జరుగనుంది. ఇక మూడు ముళ్ల బంధంతో ఒక్కటైన ఈ జంట పెళ్లికి ముందు కొందరితో అనుబంధం కొనసాగించారు. మరి వీళ్లను గతంలో ప్రేమించిన వాళ్లు పెళ్లి పై ఏమంటున్నారో చూద్దాం.

 

గతంలో అనుష్క బాలీవుడ్ నటుడు రణవీర్ సింగ్‌‌ను ప్రేమించిందని, అతడితో డేటింగ్ చేసిందనే వార్తలొచ్చాయి. కోహ్లికి కూడా ఇంగ్లండ్‌కు చెందిన మహిళా క్రికెటర్ ప్రపోజ్ చేసింది. ఇపుడు అనుష్క-కోహ్లి పెళ్లి చేసుకున్న నేపథ్యంలో వారు స్పందించారు. ‘బ్యాండ్ బాజా భారత్' సినిమాలో కలిసి నటించిన అనుష్క శర్మ, రణవీర్ సింగ్ అప్పట్లో ప్రేమలో పడ్డారని, డేటింగ్ చేశారని వార్తలు వచ్చాయి. అప్పట్లో రణవీర్ తన ప్రేమను సీరియస్‌గా తీసుకున్నప్పటికీ అనుష్క విరాట్ కోహ్లి వైపు ఆకర్షితురాలవ్వడంతో లైట్ తీసుకున్నాడని, ఆ తర్వాత అతడు దీపిక పదుకోన్ తో డేటింగ్ చేయడం ప్రారంభించాడని వార్తలు వచ్చాయి.

 

తాజాగా అనుష్క శర్మ తన ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్లో పోస్టు చేసిన పెళ్లి ఫోటోలను అతడు లైక్ చేశాడు. అప్పట్లో అనుష్కను రణవీర్ సింగ్ చాలా ప్రేమించాడని, అయితే అనుష్క మాత్రం అతడి ప్రేమను నిరాకరించిందని టాక్. అనుష్క-విరాట్ పెళ్లిపై అతడు స్పందించక పోవచ్చని అంతా భావించారు. అయితే పెళ్లి ఫోటోలను అతడు లైక్ చేయడంతో అనుష్కను అతడు ఎప్పుడో లైట్ తీసుకున్నాడని స్పష్టమవుతోంది.

 

ఇక ఇంగ్లండ్ మహిళా క్రికెట్ జట్టు సభ్యురాలు, ఆల్ రౌండర్ డేనియల్ వైట్.. 2014లో కోహ్లికి ప్రపోజ్ చేసింది. ‘కోహ్లి నన్ను పెళ్లి చేసుకో' అంటూ ట్వీట్ చేసింది. ఆ తర్వాత ఇద్దరూ మంచి ఫ్రెండ్స్ అయ్యారు. ఈ సంవత్సరం ఆమెకు విరాట్ ఓ బ్యాట్ కూడా బహుమతిగా ఇచ్చారు. తాజాగా విరాట్ కోహ్లి పెళ్లి అనుష్కతో జరిగిన నేపథ్యంలో డేనియల్ వైట్ ట్విట్టర్ ద్వారా విష్ చేశారు. కంగ్రాట్స్ విరాట్ కోహ్లి, అనుష్క అంటూ ట్వీట్ చేశారు.

 

ఇటలీలోనే ఈ జంట ఎందుకు పెళ్లిచేసుకున్నట్లు? ఇందుకు కారణం ప్రముఖ బాలీవుడ్‌ దర్శక-నిర్మాత, నటి రాణీ ముఖర్జీ భర్త ఆదిత్య చోప్రానేనట. ఆదిత్య.. రాణి ముఖర్జీని 2014లో ఇటలీలోనే పెళ్లి చేసుకున్నారు. అనుష్క విరాట్‌ని పెళ్లిచేసుకోవాలని నిర్ణయించుకున్నప్పుడు ఆదిత్య ఇటలీలో పెళ్లిచేసుకోమని సలహా ఇచ్చారట. భారత్‌లో ఎక్కడ వివాహం చేసుకున్నా మీడియా, అభిమానులు హడావుడి చేస్తారని.. ఇటలీలోఅయితే చాలా ప్రశాంతంగా ఉంటుందని చెప్పారట.

 

పెళ్లి సందర్భంగా అనుష్క వేలికి తొడిగే రింగ్ కోసం విరాట్ కోహ్లి దాదాపు మూడు నెలలు పాటు వెతికాడట. ఇందుకోసం ఆయన చాలా రేర్ డైమండ్ సెలక్ట్ చేసుకున్నట్లు తెలుస్తోంది. ఆస్ట్రేలియన్ డిజైనర్ దీన్ని మరింత అందంగా తీర్చి దిద్దాడని, ఈ రింగ్ ఖరీదు రూ. 1 కోటి ఉంటుందట.