నిన్న మొదలైన నామినేషన్స్ ప్రక్రియ నేడు ముగిసింది. ఇంటిలో మిగిలిన కొద్దిమంది సభ్యులలో ఐదుగురు ఎలిమినేషన్ కి నామినేట్ అయ్యారు. హారిక, మోనాల్, అభిజిత్, అవినాష్ మరియు అమ్మ రాజశేఖర్ ఎలిమినేషన్ కి నామినేట్ కావడం జరిగింది. ఇంటి సభ్యులలో అత్యధికులు వీరి తలపై గుడ్లు పగులగొట్టిన నేపథ్యంలో ఈ ఐదుగురు నామినేట్ కావడం జరిగింది. అమ్మ రాజశేఖర్, అవినాష్ లపై అత్యధిక సభ్యులు వ్యతిరేకత వ్యక్తం చేశారు. 

నామినేషన్స్ ప్రక్రియలో అభిజిత్, అమ్మ రాజశేఖర్ మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. చిల్లర కామెడీ అన్న నోయల్ మాటలను సమర్ధించి ఇద్దరు టెక్నిషియన్స్  కడుపుపై కొట్టారని అమ్మ రాజశేఖర్ ఆవేదన వ్యక్తం చేశారు. ఎదుటివాళ్లను అనే మీరు మిమ్ముల్ని ఎవరైనా అంటే తట్టుకోలేరని కారణం చెప్పి అభిజిత్ నామినేట్ చేశాడు. వాడివేడిగా సాగిన ఈ కార్యక్రమంలో ఇంటి సభ్యుల చొరవతో ఆగిపోయింది. 

అవినాష్ ని కూడా ఎక్కువ మంది నామినేట్ చేశారు. మోనాల్, లాస్య, హారిక మరియు అభిజిత్ అవినాష్ ని నామినేట్ చేయడం జరిగింది. ఇంటిలో మాత్రం అవినాష్, అమ్మ రాజశేఖర్ మరియు హారిక ఒకవైపు మిగతా సభ్యులు ఒకవైపు చేరారు. నీ ప్రవర్తనలో క్లారిటీ లేదు.. కన్ఫ్యుజ్ చేస్తున్నావ్ అనే కారణంపై నామినేట్ చేసినట్లు అఖిల్ చెప్పాడు. మోనాల్ ని అఖిల్ నామినేట్ చేయడంతో అందరూ షాక్ అయ్యారు.