వివాదాలతో మొదలెట్టి దాంతోనే పబ్లిసిటీ, క్రేజ్ సంపాదించుకున్న  లక్ష్మీస్‌ ఎన్టీఆర్‌ ఇప్పుడు నిజమైన వివాదాలతో విడుదలకు ఇబ్బందులు వచ్చేటట్లు ఉన్నాయి. తెలుగు దేశం నాయకులు ఈ సినిమాని ఎట్టి పరిస్దితుల్లో రిలీజ్ కాకూడదని కంప్లైంట్స్ మీద కంప్లైంట్స్ చేసారు. వాటిలో కొన్ని కొట్టిపారేసినా , మరికొన్ని సమస్యలుగా మారుతున్నాయి. తాజాగా సినిమాలో అభ్యంతరకరమైన అంశాలేమైనా ఉన్నాయా? లేదా? పరిశీలించేందుకు మీడియా సర్టిఫికేషన్‌ అండ్‌ మానిటరింగ్‌ కమిటీ (ఎంసీఎంసీ) ముందు చిత్రం ప్రివ్యూను ప్రదర్శించాలని ఆ సినిమా నిర్మాత రాకేష్‌రెడ్డిని ఎన్నికల సంఘం ఆదేశించింది. 

సోమవారం ఉదయం 11.30 గంటలకు ఈ ప్రదర్శనను ఏర్పాటు చేయాలని సూచిస్తూ రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి గోపాలకృష్ణ ద్వివేది ఆదేశాలు జారీ చేశారు. లక్ష్మీస్‌ ఎన్టీఆర్‌ సినిమాలోని ప్రోమోలు, రాజకీయ ప్రకటనలు.. ఎన్నికల ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించేలా ఉన్నాయని చిత్తూరు జిల్లాకు చెందిన పీ.మోహన్‌ ఈ నెల 14న ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు. ఎంసీఎంసీ నుంచి తగిన అనుమతి తీసుకోకుండానే వీటిని ప్రదర్శిస్తున్నారని పేర్కొన్నారు. 

ప్రవర్తనా నియమావళి ఉల్లంఘనలకు సంబంధించిన ఆధారాలంటూ కొన్ని అంశాలను కూడా తన ఫిర్యాదుతో పాటు జతపరిచారు. వీటిని పరిశీలించిన ఎన్నికల సంఘం సినిమా నిర్మాత రాకేష్‌రెడ్డికి ఈ నెల 15న ఒకసారి, 17న మరోసారి నోటీసులు జారీ చేసింది. వాటికి వాట్సాప్‌ ద్వారా రాకేష్‌రెడ్డి సమాధానమిచ్చారు. 

ఫిర్యాదులోని అంశాలు, నిర్మాత ఇచ్చిన సమాధానాన్ని పరిశీలించిన అనంతరం.. ఈ సినిమాలో ఉన్న విషయాన్ని పరిశీలించాలని ద్వివేది నిర్ణయించారు. ఈ మేరకు ఎంసీఎంసీ ముందు ప్రివ్యూ ప్రదర్శించాలని ఆదేశించారు. దాని ఆధారంగా తదుపరి చర్యలు తీసుకుంటారు.