బాలీవుడ్ అగ్ర హీరో అమితాబ్ బచ్చన్ ఇప్పటికీ సినిమాలు చేస్తూ తన అభిమానులను అలరిస్తుంటాడు. ఓ పక్క సినిమాలు మరోపక్క ప్రకటనల్లో నటిస్తూ బిజీగా గడుపుతున్నారు. ఎన్నో సంవత్సరాలుగా ఆయన 'కౌన్ బనేగా కరోడ్ పతి' షోకి హోస్ట్ గా వ్యవహరిస్తున్నారు.

ప్రస్తుతం ఈ షో పడవ సీజన్ నడుస్తోంది. ఇటీవల అహ్మదాబాద్ నుండి వచ్చిన కాజల్ పటేల్ అత్యంత వేగంగా ఫాస్టెస్ట్ ఫింగర్ లో సరైన సమాధానాలు చెప్పి హాట్ సీటుకి చేరుకున్నారు. గేమ్ లో అమితాబ్ గురించి తెలుసుకోవాలనే ఆసక్తితో కాజల్.. అమితాబ్ ను పలు ప్రశ్నలు అడిగారు.

వాటిలో ఒక ప్రశ్నకి అగ్రహీరో అమితాబ్ నుండి వచ్చిన సమాధానం విని చాలా మంది అభిమానులు షాక్ అయ్యారు. 2000వ సంవత్సరంలో కేబీసి ప్రారంభించిన సమయంలో తనకు వెన్నుపూస సంబంధిత క్షయవ్యాధి ఉందని గుర్తించడం జరిగిందట. ఆ తరువాత తగిన ట్రీట్మెంట్ తీసుకోవడంతో ఇప్పుడిప్పుడే దాని బారి నుండి బయటపడినట్లు తెలిపారు అమితాబ్.

ఈ వ్యాధి కారణంగా ఆయన ఎన్నో ఇబ్బందులు పడ్డారట. కుర్చీలో కూర్చున్నప్పుడు ఎంతో నొప్పి వచ్చేదని, వ్యాధిని నిరోధించడం కోసం చాలా మందులు వాడాల్సి వచ్చిందని చెప్పారు. ఇలాంటి వ్యాధులతో చాలా మంది బాధ పడుతున్నారని, దీనిపై ప్రజల్లో అవగాహన తీసుకురావాల్సిన అవసరం ఎంతైనా ఉందని అన్నారు.