బాలీవుడ్ లో 'విక్కీ డోనర్', 'అంధాధూన్' వంటి సినిమాల్లో నటించి తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు సంపాదించుకున్నాడు కుర్ర హీరో ఆయుష్మాన్ ఖురానా. బాలీవుడ్ లో అతడికున్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.

రీసెంట్ గా అతడు నటించిన 'డ్రీమ్ గర్ల్' సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ సినిమాకి మంచి రెస్పాన్స్ వస్తోంది. తొలిరోజు ఈ చిత్రం భారీ ఓపెనింగ్స్ రాబట్టింది. రాజ్ శాండిల్య డైరెక్ట్ చేసిన ఈ సినిమా మొదటి రోజు రూ.10.05 కోట్లను వసూలు చేయగా.. రెండో రోజు రూ.16.42 కోట్లు.. మూడో రోజు రూ.18.1 కోట్లు వసూలు చేసి సత్తా చాటింది.

మొదటి మూడురోజులకు గాను ఈ సినిమా రూ.44.57 కోట్లు వసూలు చేసి నిర్మాతలకు ఆనందాన్ని తీసుకొచ్చింది. ఈ సినిమాలో ఆయుష్మాన్ నిరుద్యోగిగా కనిపిస్తాడు. డబ్బుల కోసం చిన్న చిన్న నాటకాలలో అమ్మాయి పాత్రలు పోషిస్తూ జీవనం సాగిస్తుంటాడు.

ఆ సమయంలో అతడికి కాల్ సెంటర్ లో ఉద్యోగం వస్తుంది. అందులో అమ్మాయి గొంతుతో మాట్లాడుతూ అబ్బాయి, అమ్మాయిలతో స్నేహం చేయాలి. పూర్తి స్థాయి వినోదాత్మకంగా తెరకెక్కిన ఈ సినిమాకి విమర్శకుల నుండి పాజిటివ్ రెస్పాన్స్ వస్తోంది.