--సూర్య ప్రకాష్ జోశ్యుల

అనగనగా ఓ డబ్బున్న అమ్మాయి. ఆమెని ఓ పేదింటి అబ్బాయి ప్రేమిస్తాడు. కొంతకాలం డ్యూయిట్స్ గట్రా పాడుకున్నాక, ఈ విషయం ఆమె ఫ్యామిలీలో తెలుస్తుంది. దాంతో  ఆ పిల్ల తండ్రి  ముందుగా  రిహార్సల్ చేసుకున్నట్లుగా   సీన్ లోకి వచ్చి ఠాఠ్...మీ ప్రేమ కథకు నేను గ్రీన్ సిగ్నల్ ఇవ్వను...మీ చావు మీరు ఛస్తానన్నా ఊరుకోను...మా అమ్మాయికు మా కులపోడికే, మాలా డబ్బున్న వాడికే ఇచ్చి పెళ్ళి చేసేస్తాను అని శపధాలు చేస్తాడు. ఆ శపధం నెరవేర్చుకోవాటనికి ప్రయత్నాలు చేస్తాడు. అయితే ఆ పేదింటి కుర్రాడు ఊరుకుంటాడా...నా ప్రేమను గెలిపించుకునే తీరుతా అని తన స్టైల్ లో శపధం చేసి తన ప్రయత్నాలు మొదలెడతారు.  

ఇదీ ఎన్నో హిట్ సినిమాల పేద- గొప్ప లవ్ స్టోరీ ఫార్ములా. అయితే ఎవరో అన్నట్లు కథలు తొమ్మిదే..వాటినే మార్చి..ఏమార్చి ...తొమ్మిది లక్షలు సినిమాలు తీసుకోవాలి అని. అయితే ఈ ఫార్ములా హిట్, సేఫ్. కావటంతో ఓ టైమ్ లో అన్ని భాషల్లోనూ ఈ టైప్ కథలు వచ్చాయి.  అయితే ఈ మధ్యన వాటి జోరు తగ్గింది.   ఆ లోటు ని తీర్చటానికా అన్నట్లు దొరల రోజుల నాటి ప్రేమ కథ దర్జాగా థియోటర్లలో దిగింది. అందుకు  80వ దశకాన్నే నేపధ్యంగా తీసుకున్నారు..మరి ఈ ప్రేమ కథ కొత్తగా అనిపించిందా, కథలో ఉన్న దర్శకుడు డిస్కస్ చేసిన పాయింట్ ఏమిటి, ఇప్పటివరకూ వచ్చిన ప్రేమ కథలకు ఈ సినిమాకు తేడా ఏమిటి, ప్రేమ కథలకు మహారాజ పోషకులనైన యూత్ కు పడుతుందా వంటి విషయాలు రివ్యూలో చూద్దాం. 


కథేంటి..

అది 1980 ..తెలంగాణాలో ఓ పల్లెటూరు. ఆ ఊరు మొత్తం ఊరి  పెద్ద దొర (వినయ్ వర్మ) కనుసన్నల్లో ఉంటుంది. దొర కూతురు అయిన చిన్న దొరసాని దేవకి (శివాత్మిక రాజశేఖర్)ని గడిలో పెట్టి ఎవ్వరికి కనిపించకుండా అల్లారుముద్దుగా  పెంచుతాడు.  ఆమెకు తండ్రి అంటే భయం.  ఇక బతుకుమ్మ పండగ టైమ్ లో  కూలీ కొడుకైన రాజు (ఆనంద్ దేవరకొండ) దొరసానిని మొదటి సారి చూస్తాడు. తొలి చూపులోనే ఆమెపై మనస్సు పడతాడు. దొరసాని కూడా రాజుని ఇష్టపడుతుంది. ఆ ఇష్టం ప్రేమగా మారుతుంది. దాంతో ఆమె గడీ బయిటకు వచ్చి అతన్ని కలుసుకుంటూంటుంది.  అయితే ఇలాంటి వ్యవహారాలు ఎంతోకాలం రహస్యంగా సాగవు. ఓ రోజు దొర కి వీళ్లిద్దరూ మంచి మూడ్ లో ముద్దులు పెట్టుకుంటూ కనపడతారు.  

కూలోడి కొడుకు తన కూతురుని  ప్రేమించడాన్ని జీర్ణించుకోలేక రాజు  తల్లిదండ్రులను చిత్రవథ చేయిస్తాడు. అంతేకాదు రాజుని పోలీసులకు పట్టిస్తాడు. మరో ప్రక్క రాజుని మర్చిపోవాలని దేవకికి వార్నింగ్ ఇస్తాడు. ఆమెను అమెరికా పంపించే ప్రయత్నం చేస్తాడు. ఈ లోగా ఈ ప్రేమ కథ నక్సలైట్ శంకరన్న (కిషోర్ )కు తెలుస్తుంది. దాంతో అతను ...రాజుని పోలీస్ ల నుంచి తప్పిస్తాడు. అప్పటికే దొరసాని కూడా రాజుని వెతుక్కుంటూ వస్తుంది.   చివరకు రాజు, దేవకిల ఒకటయ్యారా..? ఈ క్రమంలో రాజు  ఎదుర్కొన్న కష్టాలు ఏంటీ….? చివరికి రాజు…దేవకిని సొంతం చేసుకున్నాడా లేదా తెరమీద చూడాల్సిందే.
వారి ప్రేమ కథ ఎలా ముగిసింది..? అన్నది సినిమా కథ.     
 
పాత కాలం కథకు..అదే కాలం స్క్రీన్ ప్లే..

మనం ఎనభైల కాలంలోకి  సినిమా చేస్తున్నాం కదా..అప్పటి సినిమాల్లో వచ్చే స్క్రీన్ ప్లే తీసుకుంటే బాగుంటుందని దర్శకుడు భావించి పనిగట్టుకుని స్క్రీన్ ప్లేని డిజైన్ చేసినట్లు అనిపిస్తుంది.  ఈ సినిమాతో దర్శకుడుగా పరిచయమైన మహేంద్ర చాలా కన్వెన్షినల్ కథను ఎంచుకోవటమే ఆ ఫీల్ రావటానికి కారణమైంది. ఇప్పటికి ఎన్నో సార్లు  తెరకెక్కిన కాంప్లిక్ట్ నే కథలో మెయిన్ ప్లాట్ గా తీసుకున్నారు. దాంతో కొత్త కథ చూస్తున్నట్లు అనిపించదు. ఇంతకు ముందు చూసిన సినిమానే మళ్లీ చూస్తున్నట్లు అనిపిస్తుంది.  జరిగే సీన్స్ ఊహకు అందుతూంటాయి.

ఇది చాలదన్నట్లు  చాలా స్లో నేరేషన్ తో సినిమాని నడుస్తూంటుంది. అప్పటికీ పీరియడ్ సెటప్ చాలా వరకూ కాపాడింది. ఎంత తెలుసి ఉన్న కథ అయినా ఇంట్రస్టింగ్ స్క్రీన్ ప్లే తో చెప్పే ప్రయత్నం చేయాలి. అప్పట్లో వచ్చిన కాదల్ (ప్రేమిస్తే)లో అది మనకు కనపడుతుంది. ఆ సినిమాతో పోలిక కాదు కానీ, తెలిసిన కథనే తెలివిగా చెప్పారు. ఈ సినిమా మాత్రం ఇంకా వెంకటేష్ చంటి రోజుల నాటి స్క్రీన్ ప్లేతోనే నడుస్తుంది. 

ఎవరెలా చేసారంటే...

ఈ చిత్రంతో పరిచయమైన విజయ్ దేవరకొండ సోదరుడు ఆనంద్ దేవరకొండలో నటించాలన్న తాపత్రయం ఉంది కానీ అందుకు తగ్గట్లుగా నటన కనపడలేదు. చాలా చోట్ల నెర్వస్ గా కనిపించారు. శివాత్మిక మాత్రం గ్లామర్ గా ఉంది. కొన్ని సీన్స్ లో గుర్తుండిపోయేలా చేసింది. మిగతా సీనియర్స్ పాత్రలకు తగినట్లు నటించుకుంటూ వెళ్లిపోయారు. 

టెక్నికల్ టీమ్

ఈ సినిమా కు ప్లస్ పాయింట్ ప్రశాంత్ విహారి ఇఛ్చిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్, పాటలు.  'కళ్లల్లో కలవరమై' సాంగ్ చాలా బాగుంది.  కొత్తవాడైనా ఓ పిరియాడిక్ లవ్‌ స్టోరీని తెరకెక్కించడంలో దర్శకుడు మహీంద్రా ఎక్కడా తడబడలేదు.  సినిమాటోగ్రఫీ సైతం బాగుంది బాగుంది. ఆ రోజుల్లోకి మనని తీసుకెళ్లాయి విజువల్స్. ఎడిటింగ్ మాత్రం ఇంకాస్త షార్ప్ గా ఉంటే బాగుండేది.  మధుర శ్రీధర్ రెడ్డి ప్రొడక్షన్ వ్యాల్యూస్ బాగున్నాయి. అన్ని బాగున్నా ఈ సినిమా రైటింగ్ సైడే ఈ సినిమా వీక్ అవటం ఇబ్బందిగా మారింది. పక్కా తెలంగాణ యాసలో డైలాగులు, ఆనాటి కాలాన్ని ప్రతిబింబించేలా సెట్‌లు, లొకేషన్లు, సహజసిద్ధమైన మేకప్ ఈ సినిమాకు కలిసొచ్చిన అంశాలు.

ఫైనల్ థాట్

ఈ దొరసాని ...అందరికీ నచ్చటం కష్టమే.

Rating: 2/5

ఎవరెవరు..

న‌టీన‌టులు: ఆనంద్ దేవ‌ర‌కొండ‌, శివాత్మిక రాజ‌శేఖ‌ర్‌, క‌న్న‌డ కిశోర్‌, విన‌య్ వ‌ర్మ‌, `ఫిదా` శ‌ర‌ణ్య త‌దిత‌రులు
బ్యాన‌ర్‌: మ‌ధుర ఎంట‌ర్‌టైన్‌మెంట్స్, బిగ్ బెన్ సినిమాస్
స‌మ‌ర్ప‌ణ‌: డి.సురేష్‌బాబు
సినిమాటోగ్రఫీ : సన్నీ కూరపాటి
ఎడిటర్ : నవీన్ నూలి
సంగీతం : ప్రశాంత్ ఆర్ విహారి
ఆర్ట్ డైరెక్టర్ : జెకె మూర్తి
కో ప్రొడ్యూసర్ : ధీరజ్ మొగిలినేని
నిర్మాతలు : మధుర శ్రీధర్ రెడ్డి, యశ్ రంగినేని
రచన, దర్శకత్వం : కె.వి.ఆర్. మహేంద్ర