టీఆర్‌పీ రేటింగ్ కోసం సినిమా వాళ్లని వాడుకోవద్దు.. పవన్ కళ్యాణ్ హెచ్చరిక.. రాజకీయాలకు లాగొద్దంటూ విజ్ఞప్తి
టీఆర్‌పీ రేటింగ్‌ల కోసం న్యూస్ ఛానెళ్లు సినిమా పరిశ్రమని వాడుకుంటున్నాయని, కానీ పరిశ్రమలోని సమస్యలను చూపించడం లేదని పవన్ కళ్యాణ్ అన్నారు.

రాజకీయ అంశాలపై సంబంధం లేని చిత్ర పరిశ్రమ, సినిమాకి చెందిన వారిని లాగొద్దని, వివాదాలు కాదు, సమస్యలు చూపించాలని హీరో, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అన్నారు. చాలా వరకు టీవీ ఛానెళ్లు సినిమా పరిశ్రమని తమ టీఆర్‌పీ రేటింగ్‌ల కోసం వాడుకుంటాయి, కాంట్రవర్సీలకు ప్రాధాన్యతనిస్తాయని, కానీ చిత్ర పరిశ్రమలోని సమస్యలను చూపించాలని తెలిపారు పవన్ కళ్యాణ్.
`మహాన్యూస్`కి సంబంధించిన `మహా మ్యాక్స్` పేరుతో కొత్తగా ఎంటర్‌టైన్‌మెంట్ ఛానెల్‌ని పవన్ కళ్యాణ్ లాంఛ్ చేశారు. అతిథిగా వచ్చిన ఆయన మాట్లాడుతూ, ఇప్పటి వరకు సినిమాలకు సంబంధించి ఎంటర్‌టైన్‌మెంట్‌ని కవర్ చేసే ప్రత్యేకమైన ఛానెల్ లేదని, న్యూస్ ఛానెల్స్ లో బులెటిన్‌గానే సినిమాని చూపిస్తారని, కానీ ప్రత్యేకంగా సినిమాకి సంబంధించిన ప్రత్యేక టీవీ లేదు, మొదటగా ఆ ప్రయత్నం చేసిన మహాన్యూస్‌కి పవన్ అభినందనలు తెలిపారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సినిమా వాళ్లు కళాకారులు, ఆర్ట్స్ కి సంబంధించినవారు. వారికి రాజకీయాలకు సంబంధం లేదు. కానీ వారికి సంబంధం లేని విషయాలపై వారిని స్పందించాలని (చంద్రబాబు అరెస్ట్ పై స్పందించాలని) డిమాండ్ చేయడం సరికాదన్నారు. ఇటీవల ఏపీలో జరుగుతున్న పరిణామాలపై సినిమా వాళ్లు ఎవరూ స్పందించడం లేదని చాలా మంది అంటున్నారు. కానీ కళాకారులు న్నితమైన వాళ్లు, వారు ఇలాంటి విషయాలపై స్పందించాలంటే ఇబ్బంది పడతారు. కాబట్టి వారిని బలవంతం చేయడం సరికాదన్నారు పవన్. ఈ సందర్భంగా ర జనీకాంత్ ప్రస్తావన కూడా తీశారు పవన్.
చాలా వరకు టీవీ ఛానెళ్లు చిత్రపరిశ్రమ కాంట్రావర్సీలు చేయడానికి, లేదంటే టీఆర్‌పీ కోసం వాడుకుంటున్నారు. కానీ చిత్ర పరిశ్రమలో సమస్యలను, కళాకారుల కష్టాలన బయటకు తీసుకురావాలని, వాటిపై దృష్టిపెట్టాలని, పరిశ్రమకి ఉపయోగపడేలా టీవీ ఛానెల్స్ ఉండాలని, అలా `మహామ్యాక్స్` ఉంటుందని ఆశిస్తున్నట్టు తెలిపారు. ఈ సందర్భంగా తనతో పనిచేసిన నిర్మాతలను ఉద్దేశించి మాట్లాడుతూ తన సినిమా పేరుని తప్పు పలికారు పవన్. `ఉస్తాద్ భగత్‌సింగ్`ని కాస్త `సర్దార్ భగత్ సింగ్` అంటూ చెప్పారు, పేరు గుర్తురాక తడబడ్డారు. హరీష్ శంకర్ దర్శకత్వంలో `ఉస్తాద్ భగత్ సింగ్` చిత్రం రూపొందుతున్న విషయం తెలిసిందే. దీన్ని మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్నారు.