యంగ్ హీరో శర్వానంద్ ఇటీవల ప్రమాదానికి గురైన సంగతి తెలిసిందే. తమిళంలో ఘనవిజయం సాధించిన 96 చిత్ర రీమేక్ లో శర్వానంద్ నటించబోతున్నాడు. ఈ చిత్ర షూటింగ్ మరికొన్ని రోజుల్లో ప్రారంభం కావాల్సి ఉంది. ఈ చిత్రం కోసం బ్యాంకాక్ లో శర్వానంద్ స్కైడైవింగ్ లో శిక్షణ పొందుతున్నాడు. ఈ సందర్భంగా స్కైడైవింగ్ చేస్తూ శర్వానంద్ ప్రమాదవశాత్తూ గాయపడ్డాడు. 

శర్వానంద్ భుజానికి తీవ్ర గాయం కాగా, కాలికి కూడా గాయమైంది. దీనితో చిత్ర యూనిట్ శర్వానంద్ ని వెంటనే హైదరాబాద్ తరలించింది. శర్వానంద్ కు వైద్యులు శస్త్రచికిత్స పూర్తి చేశారు. భుజానికి శస్త్రచికిత్స చేసేందుకు వైద్యుల బృందం దాదాపు 11 గంటల పాటు శ్రమించింది. మొత్తంగా శర్వానంద్ కు విజయవంతగా చికిత్స పూర్తి చేశారు. 

రెండు నెలల పాటు విశ్రాంతి తీసుకోవాలని శర్వానంద్ కు వైద్యులు సూచించారు. దీనితో శర్వానంద్ నటిస్తున్న చిత్రాలు వాయిదా వేయక తప్పని పరిస్థితి నెలకొంది. స్కైడైవింగ్ చేస్తున్న సమయంలో సరైన దిశలో ల్యాండ్ కాకపోవడంతో శర్వానంద్ ప్రమాదానికి గురయ్యాడు.