ఆడియెన్స్ ని ఏకవచనంతో సంభోధిస్తూ వ్యాఖ్యానించిన `డీజే టిల్లు` నిర్మాత సూర్యదేవర నాగవంశీ తన కామెంట్లపై స్పందించారు. ఏట్టకేలకు ఆడియెన్స్ కి క్షమాపణలు చెప్పారు.

`డీజే టిల్లు` నిర్మాత సూర్యదేవర నాగవంశీ.. తన వివాదాస్పద కామెంట్లపై స్పందించారు. ఆడియెన్స్ కి క్షమాపణలు చెప్పారు. ఈ మేరకు ఆయన ట్విట్టర్‌ ద్వారా క్షమాపణల నోట్‌ని పంచుకున్నారు. ప్రేక్షకులంటే తమకు గౌరవం అని, వారే సినిమాకి బలం అని తెలిపారు. వారిని సోదర సమానులు అని, అందుకే ఏక వచనంతో మాట్లాడినట్టు చెప్పారు. ఎవరి మనసులనైనా నొప్పించి ఉంటే క్షమించాలని పేర్కొన్నారు.

Scroll to load tweet…

ఇందులో నాగవంశీ చెబుతూ, ప్రేక్షకులంటే మాకెంతో గౌరవం. వారే ఏ నిర్మాణ సంస్థకైనా బలం. ప్రేక్షకులు పెట్టే విలువైన డబ్బుకు మించిన వినోదం అందించామన్న ఆనందంలో `డీజే టిల్లు` విడుదలైన రోజు మీడియాతో మాట్లాడుతూ అన్న మాటలు ప్రేక్షకులకు ఇబ్బంది కలిగించాయన్న వార్తలు తెలిసి బాధపడ్డాను. ప్రేక్షుకలను ఏక వచనంతో సంబోధిస్తూ మాట్లాడటం, వారిని నా సోదరులుగా భావించడం వల్లే. అయినా వారి మనసు నొచ్చుకోవడం పట్ల క్షంతవ్యుడిని. ముందుగా చెప్పినట్టే ఎప్పటికీ ప్రేక్షకులు అంటే మాకెంతో గౌరవం. వారే మా బలం` అనితెలిపారు. 

`డీజే టిల్లు`తో సక్సెస్‌ అందుకున్న నాగవంశీ ఇంతకి ఆడియెన్స్ ని ఏమన్నారంటే. `డీజే టిల్లు` విడుదలైన రోజు సక్సెస్‌ సెలబ్రేషన్‌ నిర్వహించారు. ఇందులో నిర్మాత కలెక్షన్ల గురించి మాట్లాడుతూ, `ఈ లెక్కలన్నీ మనలాంటి మేథావులకు కావాలి గానీ, ఆడియెన్స్ కి వాడిచ్చే 150రూపాయలకు వాడు నవ్వుకున్నాడా? లేడా అనేది సరిపోతుంది. వాడిచ్చే 150 రూపాయలకు 1500 విలువ నవ్వించాం. అదే చాలు వాడికి. వాడు హ్యాపీ` అని ఘాటు వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. 

నిర్మాత నాగవంశీ ఇలాంటి వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం కొత్తేమీ కాదు. గతంలోనూ ఆయన ఇలాంటి నిర్లక్ష్యంగానే స్పందించారు. `డీజే టిల్లు` చిత్ర ప్రెస్‌మీట్‌లో హీరోయిన్‌ని ఉద్దేశించి `ఇంతటి అందమైన హీరోయిన్‌ని ముద్దు పెట్టుకోవాల్సి వస్తే నేను అస్సలు వదులుకోను` అని వ్యాఖ్యానించడం వివాదంగా మారింది. ఓ నిర్మాత ఇలాంటి బోల్డ్ కామెంట్‌ చేయడం అందరిని ఆశ్చర్యానికి గురి చేసింది. దీనిపై సర్వత్రా విమర్శలు వచ్చాయి. 

నాగవంశీ..పవన్‌ కళ్యాణ్‌నటించిన `భీమ్లా నాయక్‌` చిత్రానికి కూడా నిర్మాత అనే విషయం తెలిసిందే. అయితే `భీమ్లా నాయక్‌` విడుదల ఎప్పుడూ అని ప్రశ్నించిన మీడియాకి ఆయన స్పందిస్తూ, ఆ విషయాన్ని జగన్‌ ని అడగాలని వ్యాఖ్యానించారు. ఈ మాటలు కూడా వివాదంగా మారడంతో దీనిపై వివరణ ఇచ్చాడు నిర్మాత నాగవంశీ. అంతకు ముందు `వరుడు కావలెను` సక్సెస్‌ మీట్‌లోనూ ఆసినిమాకి పనిచేసిన రైటర్‌ని `ఈ సినిమాకి ఎంత రేటింగ్‌ ఇస్తారని` మీడియా ప్రశ్నించగా, దానికి నిర్మాత స్పందిస్తూ రేటింగ్‌లు లేకుండా చేయాలనే రివ్యూలు రాసేవారిని రైటర్‌ని చేశామని, రేటింగ్‌లు ఆడియెన్స్ కి అవసరం లేదంటూ ఆయన దురుసుగా రియాక్ట్ అవ్వడం చర్చనీయాంశంగా మారింది.