ఆచార్య మూవీ ఫలితం డిస్ట్రిబ్యూటర్స్ ని నిలువునా ముంచింది. భారీ ధరలు చెల్లించి హక్కులు దక్కించుకున్న బయ్యర్లు లబోదిబోమంటున్నారు. నష్టాల్లో ఎంతో కొంత తిరిగి చెల్లించాలని నిర్మాతలను కోరుతున్నారు.
ఆచార్య (Acharya ) చిత్రం అనూహ్య పరాజయం పాలైన సంగతి తెలిసిందే. రూ. 130 కోట్లకు పైగా వరల్డ్ వైడ్ బిజినెస్ చేసిన ఆచార్య నాలుగు రోజులకే థియేటర్స్ నుండి వెళ్ళిపోయింది. కేవలం రూ. 45 కోట్ల వరల్డ్ వైడ్ షేర్ రాబట్టగా దాదాపు రన్ ముగిసింది. ఈ క్రమంలో డిస్ట్రిబ్యూటర్స్ దారుణంగా నష్టపోయారు. కర్ణాటకకు చెందిన రాజగోపాల్ బజాజ్ అనే డిస్ట్రిబ్యూటర్ ఈ మేరకు చిరంజీవికి లేఖ రాశారు. సినిమా అనుకున్న స్థాయిలో ఆడలేదు. పెట్టుబడిలో కేవలం 25% మాత్రమే రాబట్టింది. 75% నష్టపోయాం.
ఏడాది క్రితమే అడ్వాన్స్ చెల్లించగా, సినిమా విడుదలకు ముందు పూర్తి మొత్తం ఇవ్వడం జరిగింది. కోవిడ్ కారణంగా దారుణమైన నష్టాలు చూసిన మాకు ఆచార్య మరింత కృంగదీసింది. బయట మార్కెట్లో అప్పు తెచ్చి ఆచార్య చిత్రాన్ని డిస్ట్రిబ్యూట్ చేశాము. కావున పెద్ద మనసుతో మా పరిస్థితిని అర్థం చేసుకొని పరిహారం చెల్లించగలరు.. అంటూ లేఖలో పేర్కొన్నారు. ఆచార్య నైజాం ఎగ్జిబిటర్ గా ఉన్న వరంగల్ శ్రీను దగ్గర నుండి డిస్ట్రిబ్యూషన్ రైట్స్ రాజ్ గోపాల్ బజాజ్ కొనుగోలు చేశారు.
డిస్ట్రిబ్యూటర్స్ కి సంబంధించిన సెటిల్మెంట్స్ ఇప్పటికే ప్రారంభమైనట్లు సమాచారం. ప్రస్తుతం చిరంజీవి ఇండియాలో లేరు. ఆయన సతీసమేతంగా విదేశీ టూర్ వెళ్లారు. మరోవైపు రామ్ చరణ్ ఆర్సీ 15 షూటింగ్ లో బిజీగా ఉన్నారు. ఆచార్య చిత్రాన్ని కొణిదెల ప్రొడక్షన్ బ్యానర్ లో చిరంజీవి స్వయంగా నిర్మించిన విషయం తెలిసిందే. మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్స్ వీరి భాగస్వాములుగా ఉన్నారు. కోవిడ్ కారణంగా ఆచార్య మూవీ చాలా ఆలస్యమైంది. బడ్జెట్ పెరిగిపోవడంతో పాటు నిర్మాతలు కూడా అధిక వడ్డీలు చెల్లించారు.
70 నుండి 80 శాతం మేర డిస్ట్రిబ్యూటర్స్ నష్టపోయిన తరుణంలో ఎంత వరకు ఆచార్య నిర్మాతలు పరిహారం చెల్లిస్తారో చూడాలి. దర్శకుడు కొరటాల శివ ఆచార్య చిత్రానికి దర్శకత్వం వహించారు.
