గత కొద్ది రోజులుగా మాస్ మహారాజ రవితేజకు హిట్ అనేది లేదు.   'రాజా ది గ్రేట్'తో మళ్లీ ఫామ్‌లోకి వచ్చాడనుకున్న రవితేజాని 'టచ్ చేసి చూడు', 'నేల టిక్కెట్టు', 'అమర్ అక్బర్ ఆంటొని' రూపంలో వరుస ఫ్లాపులు పలకరించాయి. ఒకే ఏడాది మూడు ఫ్లాపులు రావడంతో చాలా ఇబ్బందికరమైన పరిస్దితి ఎదుర్కొంటున్నారు. దాంతో ఆయనతో సినిమా చేస్తే బిజినెస్ ఏ మేరకు జరుగుతుందా అనే భయాలు పట్టుకున్నాయి. 

ఈ నేపధ్యంలో  మళ్లీ ఫుల్‌ఫామ్‌లోకి వచ్చేందుకు 'డిస్కో రాజా' అవతారమెత్తుతున్నాడు. రీసెంట్ గానే ఈ చిత్రం పట్టాలు ఎక్కింది.  సైన్స్ ఫిక్షన్ సినిమా చెప్పబడుతున్న  'డిస్కోరాజా'పైనే తన ఆశలన్నీ పెట్టుకున్నాడు రవితేజ. విలక్షణమైన కథలతో సినిమాలు తెరకెక్కించే వి.ఐ. ఆనంద్ తెరకెక్కించబోతున్న 'డిస్కో రాజా' మార్చి 4 నుంచి పట్టాలెక్కనుందట. ఈ నేపధ్యంలో ఓ వార్త రవితేజనే ఆశ్చర్యానికి గురి చేసింది. 

అదేంటంటే...సురేష్ రెడ్డి అనే డిస్ట్రిబ్యూటర్ ...సినిమా ప్రారంభం కాకుండానే ఫస్ట్ కాపీ రైట్స్ ని ఫ్యాన్సీ రేట్ కు తీసుకున్నారు. దాంతో నిర్మాత ఫుల్ ఖుషీగా ఉన్నారట. రవితేజ ఇప్పుడున్న పరిస్దితుల్లో అలా బిజినెస్ జరగటం అనేది ఎవరినైనా ఆశ్చర్యపరిచే విషయమే మరి.

పీరియాడికల్ బ్యాక్ డ్రాప్‌లో సోషియో ఫాంటసీగా రవితేజ 'డిస్కోరాజా' చిత్రాన్ని తెరకెక్కించబోతున్నాడట వి.ఐ.ఆనంద్.   ఈ ఏడాది ద్వితియార్థంలో ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ సినిమాని.. ఎస్.ఆర్.టి. ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై రామ్ తాళ్లూరి నిర్మిస్తున్నాడు. మంచి విజయంకోసం ఎదురుచూస్తోన్న మాస్ మహారాజకి 'డిస్కో రాజా' ఎలాంటి సక్సెస్‌ను అందిస్తుందో చూడాలి.