బాలీవుడ్ నటి ఎల్లీ అవ్రామ్ ఇండస్ట్రీలో తనకు ఎదురైన కొన్ని చేదు అనుభవాలను బయటపెట్టింది. 'కిస్ కిస్కో ప్యార్ కరూ' సినిమాతో బాలీవుడ్ లో తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకున్న ఎల్లీకి ఆ తరువాత ఇండస్ట్రీ నిజస్వరూపం తెలిసిందట. ఇద్దరు దర్శకులు తనతో చాలా అసభ్యకరంగా ప్రవర్తించారని తాజాగా పాల్గొన్న ఓ ఇంటర్వ్యూలో ఈమె 
వెల్లడించింది.

కెరీర్ ఆరంభంలో అవకాశాల కోసం ఇద్దరు దర్శకులను కలిస్తే వారిద్దరూ తనకు షేక్ హ్యాండ్ ఇస్తూ చెయ్యి గోకి అసభ్యంగా ప్రవర్తించారని పేర్కొంది. వారు అలా ఎందుకు ప్రవర్తించారో.. దానికి అర్ధం ఏంటో కూడా తనకు తెలియదని చెప్పుకొచ్చింది.

ఇదే విషయాన్ని తన స్నేహితురాలికి చెబితే ఆమె షాకై దానికి అర్ధం చెప్పిందనీ.. దాంతో తాను దిగ్బ్రాంతికి గురయ్యానని వివరించింది. ఇండస్ట్రీలో తాను సెక్సిజం ఎదుర్కొన్నానని చెప్పిన ఈమె ఆడిషన్స్ సమయంలో తనను రకరకాల మాటలు అన్నారని చెప్పుకొని బాధ పడింది. ఒకరు తనను పొట్టిగా ఉన్నావని, మరొకరు నుదురు బాలేదని, ఇంకొకరు పళ్లు బాలేవని.. కొందరేమో తన పొడుగు జుట్టు చూసి ఆంటీ అని పిలిచేవారని చెప్పింది.

తాను నటిని కాలేనని ఇండస్ట్రీకి చెందిన ఓ అమ్మాయి ముఖం మీదే చెప్పేసిందని ఎల్లీ వివరించింది. ఓ సారి పెద్ద సినిమాలో ఛాన్స్ వస్తే.. హీరోకి తాను నచ్చలేదని ఆమె స్థానంలో మరో నటిని తీసుకున్నారని ఆవేదన వ్యక్తం చేసింది. బాలీవుడ్ లో ఎన్నో సమస్యలను ఎదుర్కొన్నానని చెప్పుకొని వాపోయింది.