ఓ సినిమా తీసి హిట్ కొడితే చాలు.. టాలీవుడ్ వారిని నెత్తిన పెట్టేసుకుంటుంది. ఈ మధ్య కాలంలో చాలా మంది కుర్ర దర్శకులు హిట్లు అందుకొని పెద్ద పెద్ద బ్యానర్ లతో పని చేసే అవకాశాలను దక్కించుకున్నారు. తాజాగా మరో ఇద్దరు కుర్ర దర్శకులకు పెద్ద బ్యానర్ ల నుండి అడ్వాన్స్ లు అందినట్లు తెలుస్తోంది.

గతంలో 'మెంటల్ మదిలో' సినిమా తీసిన దర్శకుడు వివేక్ ఆత్రేయ తాజాగా 'బ్రోచెవారెవరురా' అనే మరో సినిమా తీసి సక్సెస్ అందుకున్నాడు. ఇప్పుడు ఇతడితో కలిసి పని చేయడానికి మైత్రి మేకర్స్ ముందుకొచ్చింది. అంతేకాదు.. వివేక్ కి అడ్వాన్స్ కూడా ఇచ్చారట.

వివేక్ తదుపరి సినిమా మైత్రిలోనే ఉండే అవకాశాలు ఉన్నాయి. ప్రస్తుతం మైత్రి ఆఫీస్ లో పది మందికి పైగా దర్శకులు కథలతో కుస్తీలు పడుతున్నారు. ఇప్పుడు వివేక్ కూడా ఈ బ్యానర్ లో సినిమా చేయబోతున్నాడు. అలానే ఇటీవల 'ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ'తో సక్సెస్ అందుకున్న దర్శకుడు స్వరూప్ కి కూడా మంచి అవకాశాలు వస్తున్నాయి.

కె.ఎఫ్.సి అనే పంపిణీ సంస్థ ఇప్పుడు నిర్మాణ రంగంలోకి దిగుతోంది. ఆ సంస్థ బ్యానర్ లో స్వరూప్ సినిమా చేయబోతున్నాడు. కోన వెంకట్ కూడా స్వరూప్ కి అడ్వాన్స్ ఇచ్చినట్లు సమాచారం. మొత్తానికి చిన్న సినిమాలు తీసి పెద్ద నిర్మాతల కళ్లల్లో బాగానే పడ్డారు.