ఆడపిల్ల పుడితే చాలు.. భారం అని పుట్టినవెంటనే రోడ్ల మీదో, చెత్త కుప్పలోనో పడేస్తున్న వారి సంఖ్య రోజురోజుకి ఎక్కువవుతోంది. రీసెంట్ గా రాజస్థాన్ లోని ఓ పసికందుని చెత్తకుప్పలో పడేసి చేతులు దులుపుకున్నారు.

అయితే ఆ చిన్నారి గుక్కపెట్టి ఏడవడంతో చుట్టుపక్కన వారు చూసి పాపని ఆసుపత్రికి తరలించారు. దీనికి సంబంధించిన వీడియో దర్శకుడు వినోద్ కాప్రి దృష్టికి రావడంతో వెంటనే ఆ హాస్పిటల్ కి చేరుకొని ఆ పాపని దత్తత తీసుకుంటానని చెప్పాడట.

అంతేకాదు.. తాను తెరకెక్కించిన సినిమా టైటిల్ 'పీహూ'ని ఆ పాపకి పేరుగా పెట్టారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఆ లిటిల్ ఏంజెల్ లో ప్రేమలో పడ్డామని.. దత్తత తీసుకునే ప్రక్రియ కొనసాగుతుందని అన్నారు.

ముందు ముందు చేయాల్సింది చాలా ఉందని.. పాప ఇంటికి వచ్చే వరకు తాను ఏమీ మాట్లాడాలనుకోవడం లేదని వినోద్ అన్నారు. పాప ప్రస్తుతం 1.6 కేజీల బరువు ఉండగా.. ఆసుపత్రిలో చేరే సమయానికి శ్వాస తీసుకోవడానికి ఇబ్బంది పడిందట. ప్రస్తుతం ఆమె ఆరోగ్య పరిస్థితి బాగానే ఉన్నట్లు తెలుస్తోంది. ఇక విండో ప్రస్తుతం '155 HOURS'అనే సినిమాను రూపొందిస్తున్నాడు.