కోలీవుడ్ దర్శకుడు వెట్రిమారన్ హీరో అల్లు అర్జున్ ని ఉద్దేశించి కీలక వ్యాఖ్యలు చేశారు. వడ చెన్నై స్క్రిప్ట్ ఆయనకు నేరేట్ చేయగా రిజెక్ట్ చేశారని చెప్పారు.
కోలీవుడ్ దర్శకుడు వెట్రిమారన్ సంచలన చిత్రాలకు కేర్ ఆఫ్ అడ్రస్. ఆయన లేటెస్ట్ మూవీ విడుతలై పార్ట్ 1 మరో గొప్ప చిత్రంగా అవతరించింది. కమెడియన్ సూరిని ఆయన ఇమేజ్ కి భిన్నంగా ఓ సీరియస్ రోల్ లో దర్శకుడు వెట్రిమారన్ ప్రజెంట్ చేశారు. విడుతలై చిత్రంలో సూరి మెయిన్ రోల్ చేశారు. విజయ్ సేతుపతి కీలక పాత్రలో మెప్పించారు. ఈ చిత్రాన్ని తెలుగులో అల్లు అరవింద్ ప్రజెంట్ చేస్తున్నారు. విడుతలై చిత్ర ప్రమోషనల్ ఈవెంట్ హైదరాబాద్ లో జరగ్గా సూరి, వెట్రిమారన్, అల్లు అరవింద్ తో పాటు చిత్ర యూనిట్ పాల్గొన్నారు.
ఈ సందర్భంగా అల్లు అరవింద్ కి పాత్రికేయుల నుండి ఓ ప్రశ్న ఎదురైంది. టాలెంట్ ఎక్కడున్నా గుర్తించి ఎంకరేజ్ చేసే మీరు వెట్రిమారన్ వంటి దర్శకుడితో మూవీ ఎందుకు చేయలేదన్నారు. ఈ ప్రశ్నకు వెట్రిమారన్ స్వయంగా సమాధానం చెప్పారు. గీతా ఆర్ట్స్ బ్యానర్లో నేను సినిమా చేయాల్సింది. చర్చలు కూడా జరిగాయని క్లారిటీ ఇచ్చారు. ఈ క్రమంలో అల్లు అర్జున్ ని ఉద్దేశిస్తూ కీలక వ్యాఖ్యలు చేశారు.
'ఆడుకలం మూవీ తర్వాత అల్లు అర్జున్ నన్ను చెన్నైలో కలిశారు. నేను తమిళ్ లోకి రావాలనుకుంటున్నాను. మీకు ఆసక్తి ఉంటే స్టోరీ రాయండి. మనం మూవీ చేద్దామని అన్నారు. అప్పుడు ఆయనకు నేను వడ చెన్నై స్క్రిప్ట్ చెప్పాను. అందులో ఓ పవర్ ఫుల్ రోల్ ఆయనకు ఆఫర్ చేశాను. ముందుగా అనుకున్న స్క్రిప్ట్ వేరు. ఆ స్క్రిప్ట్ లోని ఓ పాత్ర అల్లు అర్జున్ కి చెప్పాను. హైదరాబాద్ వచ్చి గీతా ఆర్ట్స్ ఆఫీస్ లో కలిసి స్క్రిప్ట్ నేరేట్ చేశాను. అదే సమయంలో నేను మహేష్ గారిని కలిశాను. అసురన్ చిత్రం తర్వాత ఎన్టీఆర్ ని కలిశాను. ఆయనతో మూవీ చేయాల్సింది. టైం కలిసిరాలేదు' అన్నారు.
వెట్రిమారన్ కామెంట్స్ పరిశీలిస్తే... కోలీవుడ్ లో పాగా వేయాలనే ప్రణాళికలో భాగంగా అల్లు అర్జున్ దర్శకుడు వెట్రిమారన్ ని కలిశారు. ఆయన డైరెక్షన్ లో మూవీ చేయాలనుకున్నారు. వెట్రిమారన్ వడ చెన్నై స్క్రిప్ట్ అల్లు అర్జున్ కి నేరేట్ చేశారు. అయితే వడ చెన్నై మూవీలో ఒక కీలక రోల్ కి అల్లు అర్జున్ ని ఎంచుకున్నారు. అంటే అల్లు అర్జున్ తో పాటు మరో హీరో వడ చెన్నైలో నటిస్తాడు. కోలీవుడ్ టాలీవుడ్ హీరోల కాంబోలో వడ చెన్నై వెట్రిమారన్ ప్లాన్ చేశారు. అదే స్క్రిప్ట్ అల్లు అర్జున్ కి చెప్పారు. స్క్రీన్ షేర్ చేసుకోవడం నచ్చని అల్లు అర్జున్ ఆ ప్రాజెక్ట్ రిజెక్ట్ చేశారు.
తమిళ మార్కెట్ రాబట్టాలన్న కోరిక మల్టీస్టారర్ తో కుదరదని భావించి ఉండొచ్చు. లేదా ఆయన పాత్ర కంటే మరో హీరో స్క్రీన్ స్పేస్, ఇంపార్టెన్స్ ఎక్కువగా ఉండి ఉండొచ్చు. అనంతరం వడ చెన్నై చిత్రాన్ని ధనుష్ హీరోగా వెట్రిమారన్ తెరకెక్కించారు. మంచి చిత్రంగా పేరు తెచ్చుకున్న వడ చెన్నై కలెక్షన్స్ పరంగా పర్లేదు అనిపించుకుంది. బడ్జెట్ లెక్కలతో పోల్చుకుంటే యావరేజ్ వసూళ్లు సాధించింది.
