`విరాటపర్వం` సినిమా నక్సల్‌ ఉద్యమం ప్రధానంగా సాగే చిత్రం కాదని, ఓ అద్భుతమైన ప్రేమ కథా చిత్రమని తెలిపారు దర్శకుడు వేణు ఉడుగుల.

`విరాటపర్వం`(Virataparvam) సినిమా నక్సల్‌ ఉద్యమం ప్రధానంగా సాగే చిత్రం కాదని, ఓ అద్భుతమైన ప్రేమ కథా చిత్రమని తెలిపారు దర్శకుడు వేణు ఉడుగుల(Venu Udugula). నక్సల్‌ ఉద్యమం కేవలం బ్యాక్‌ డ్రాప్‌ మాత్రమే అని, మెయిన్‌ ఫ్లాట్‌ మాత్రం లవ్‌ స్టోరీనే అని చెప్పారు. రవన్న అనే నక్సలైట్‌ నాయకుడికి, ఆయన భావాలకు, రచనలకు ఆకర్షించబడ్డ అమ్మాయికి మధ్య అద్భుతమైన ప్రేమ కథని చెప్పబోతున్నామని తెలిపారు. రానా(Rana), సాయిపల్లవి(Sai Pallavi) నటించిన `విరాటపర్వం` చిత్రం ఈ నెల 17న విడుదల కానుంది. వేణు ఉడుగుల దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని సురేష్‌బాబు సమర్పణలో సుధాకర్‌ చెరుకూరి నిర్మించారు. 

చిత్ర ప్రమోషన్‌లో భాగంగా బుధవారం దర్శకుడు వేణు ఉడుగుల మీడియాతో ముచ్చటించారు. `నేను పుట్టి పెరిగిన వాతావరణం, చూసిన జీవితం, చదివిన పుస్తకాలు, నేను లాంటి సినిమాలు తీయాలో అనే ఒక విజన్‌ని ఏర్పర్చాయి` అని చెప్పిన వేణు ఉడుగుల.. తనకు తెలిసిన జీవితాన్ని చెప్పాలని, చూసిన విషయాలను చెప్పాలని, చరిత్రలో దాగిన కథలను, దాచబడిన కథలను చెప్పాలనే ఉద్దేశ్యంతో `విరాటపర్వం` కథని ఎంచుకున్నట్టు తెలిపారు.

 `విరాటపర్వం` చిత్రాన్ని ఓ సరికొత్త ప్రేమ కథగా తెరకెక్కించినట్టు చెప్పారు. ఈ కథని విని ఒకే సిట్టింగ్‌లో ఓకే చేసిన సురేష్‌బాబు, రానా, సాయిపల్లవిలకు థ్యాంక్స్‌ చెప్పారు. `విరాటపర్వం` చిత్రాన్ని రానా ఒప్పుకోవడం నా గొప్పతనం కాదు, అది ఆయన గొప్పతనం. కథ చెప్పగానే రానా గారికి నచ్చింది. ఒక కొత్త దర్శకుడు వైవిధ్యమైన కథతో వచ్చాడు, ఇలాంటి సినిమా మనం చేయకపోతే ఎవరు చేస్తారనే గొప్ప మనసుతో రానా గారు ఈ సినిమాని చేశార`ని తెలిపారు. 

రవన్న అనే పాత్రలో రానా, వెన్నెలగా సాయిపల్లవి నటించనుందని తెలిపారు. 1990లో జరిగిన రియల్‌ ఇన్సిడెంట్స్ ఆధారంగా ఈ చిత్ర కథని రాసుకున్నట్టు తెలిపారు.సాయిపల్లవి రోల్‌ సరళ అనే రియల్‌ లైఫ్‌ పాత్ర ఆధారంగా రాసుకున్నట్టు తెలిపారు. ఈ సినిమా కథ రాసుకునేసమయంలోనే సాయిపల్లవి ఓ సంచీ వేసుకుని అడవిలో నడుచుకుంటూ వస్తున్నట్టుగా ఓ కల వచ్చిందని, లక్కీగా ఆమె ఇందులో నటించేందుకు ఒప్పుకోవడం ఆనందంగా ఉందన్నారు. 

లెఫ్ట్ ఉద్యమ ప్రభావం తగ్గిన నేపథ్యంలో ఇలాంటి కథ ఇప్పుడు కనెక్ట్ అవుతుందనే ప్రశ్నకి వేణు స్పందిస్తూ, లెఫ్ట్, రైట్‌ అనేది అప్రస్తుతం అని, నేపథ్యాన్ని పక్కన పెడితే, కథలో ఉన్న ప్రధాన భావోద్వేగం ముఖ్యమని, దొంగల కుటుంబంలో ప్రేమ కథ చెబితే తప్పకుండా కనెక్ట్ అవుతుందని, అలానే విరాటపర్వంలో ఓ మంచి ప్రేమ కథని చెబుతున్నట్టు తెలిపారు. నక్సల్‌ ఉద్యమం కేవలం బ్యాక్‌ డ్రాప్‌ మాత్రమే అని తెలిపారు. 

1990లోని రాజకీయ సందర్భాన్ని ఒక వ్యక్తిగతమైన సంఘర్షణగానే చూపిస్తున్నామని, ఇది గొప్ప అనుభూతినిస్తుందని చెప్పారు. మానవ సంబంధాల నేపథ్యంలో చెప్పే కథలను ఆడియెన్స్ బాగా ఆదరిస్తారని తెలిపారు. ఎమోషనల్‌ కనెక్టివిటీ ఈ చిత్రంలో బాగా ఉందన్నారు. నక్సల్‌ నేపథ్యంలో వచ్చే తొలి ప్రేమ కథా చిత్రమిదన్నారు. చాలా కొత్తగా ఉంటుందన్నారు. సెకండాఫ్‌ తర్వాత సినిమా ర్యాంపేజ్‌ ఆడినట్టుగా ఉంటుందని, నెక్ట్స్ లెవల్‌లో ఉంటుందన్నారు. ఇలాంటి సినిమాని ఇటీవల కాలంలో ఎప్పుడూ చూసి ఉండరని, డిఫరెంట్‌ స్క్రీన్‌ప్లే గూస్‌బంమ్స్ తెప్పిస్తుందని వెల్లడించారు. ట్విస్ట్ లు, టర్న్ లతో సాగుతుందని, ప్రతి పాత్ర కథని మలుపుతిప్పుతుందన్నారు. క్లైమాక్స్ ఊహించని విధంగా ఉంటుందన్నారు.

అయితే ఇటీవల వచ్చిన `ఆచార్య`కి దీనికి సంబంధం లేదని, పూర్తి భిన్నమైన చిత్రమని చెప్పారు. ఇటీవల `విక్రమ్‌`, `మేజర్‌` సినిమాలతో ఆడియెన్స్ థియేటర్‌కి వస్తున్నారు. కొత్త ఊపు స్టార్ట్ అయ్యింది. మిడిల్‌ బడ్జెట్‌ చిత్రాలకు ఆదరణ దక్కుతుంది. ఈసినిమాకి అవన్నీ కలిసొచ్చే అంశాలని చెప్పారు దర్శకుడు వేణు ఉడుగుల. ప్రస్తుతం రెండు కథలు రాసుకున్నానని, సామాజాన్ని ప్రభావితం చేసే అంశాలతో తన కథలుంటాయని, వాటి వివరాలు ఈ చిత్రం విడుదలయ్యాక చెబుతానని తెలిపారు.