దర్శకుడు హరీష్ శంకర్ తెరకెక్కించిన 'వాల్మీకి' సినిమా టైటిల్ ని ఆఖరి నిమిషంలో మార్చాల్సి వచ్చింది. దీంతో సినిమాకి 'గద్దలకొండ గణేష్' అనే టైటిల్ పెట్టారు. టైటిల్ మార్చిన విషయంపై స్పందించిన దర్శకుడు వంశీ పైడిపల్లి ట్విటర్ వేదికగా స్పందించారు. ''ఇది చాలా బాధాకరం. 

ఏ దర్శకుడు, సినిమా ఇలాంటి బాధలు పడటానికి అర్హులు కాదు. హరీశ్.. మేమంతా మీతో ఉన్నాం. సినిమా పట్ల మీకు ఎంతటి కమిట్‌మెంట్ ఉందో మా అందరికీ తెలుసు. ‘గద్దలకొండ గణేశ్’ తప్పకుండా విజయం సాధిస్తుంది'' అంటూ రాసుకొచ్చారు.

నిజానికి 'వాల్మీకి' టైటిల్ వివాదం చాలా రోజులుగా జరుగుతోంది. కానీ సెన్సార్ సభ్యులు ఎలాంటి అభ్యంతరం చెప్పకపోవడంతో చిత్ర దర్శకనిర్మాతలు ముందుకు వెళ్లారు. కానీ అనంతపురం జిల్లాల్లో శాంతి భద్రతల దృష్ట్యా ‘వాల్మీకి’ సినిమా విడుదలను ఆపాలని కలెక్టర్లు ఆదేశాలు జారీ చేశారు.

దీంతో షాక్ అయిన దర్శకనిర్మాతలు..  డిస్ట్రిబ్యూటర్లకు నష్టం జరగకూడదని ఆఖరి నిమిషంలో సినిమా టైటిల్ మార్చారు. ఈ విషయాన్ని చిత్రబృందం స్వయంగా ప్రెస్ మీట్ నిర్వహించి కొత్త టైటిల్ 'గద్దలకొండ గణేష్' అనే వెల్లడించింది. అయితే ఈ విషయంలో హరీష్ శంకర్ ఎంతో ఎమోషనల్ అయ్యారు. మొదటిసారి నేను ఓడిపోయాననిపిస్తోందంటూ ఆవేదన వ్యక్తం చేశారు.