పవన్ కి రీమేక్ సినిమాలు సజెస్ట్ చేస్తుంది త్రివిక్రమే అన్న ఒక వాదన ఉంది. పవన్ కూడా త్వరగా పూర్తి అవుతాయనే ఆలోచనతో ఓకే చేస్తున్నారు. ఈ క్రమంలో తన అభిమానుల నుంచి సైతం విమర్శలు ఎదుర్కొంటున్నాడు. 

దర్శకుడు త్రివిక్రమ్ పని బాగుంది. దర్శకుడిగా రచయితగా రెండు చేతులా సంపాదిస్తున్నారు. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ ఆయనకు బంగారు బాతులా దొరికారు. స్టార్ హీరోలతో స్నేహం చేస్తే చాలా ప్రయోజనాలు ఉంటాయి.ఒక సినిమా సెట్ చేసుకొని కోట్లలో రెమ్యూనరేషన్ తీసుకోవచ్చు. అలాగే సదరు హీరోల యాడ్ షూట్స్ ద్వారా డబ్బులు సంపాదించుకునే అవకాశం ఉంటుంది. పవన్ కళ్యాణ్, అల్లు అర్జున్ ల అత్యంత ప్రియమైన దర్శకుడిగా త్రివిక్రమ్ ఉన్నాడు. అల్లు అర్జున్ కి అల వైకుంఠపురంలో రూపంలో ఫస్ట్ ఇండస్ట్రీ హిట్ ఇచ్చాడు. అంతకు ముందు జులాయి, సన్ ఆఫ్ సత్యమూర్తి చిత్రాలు అల్లు అర్జున్ తో చేశాడు. 

అత్యధిక బ్రాండ్ వాల్యూ కలిగిన హీరోల్లో ఒకరిగా ఉన్న అల్లు అర్జున్ పలు జాతీయ, అంతర్జాతీయ బ్రాండ్స్ కి అంబాసిడర్ గా ఉన్నారు. ఆయన నటించే యాడ్స్ షూట్ చేసే ఛాన్స్ దాదాపు త్రివిక్రమ్ కి ఇస్తాడు. ఒకటి రెండు రోజుల్లో కంప్లీట్ అయ్యే ఈ షూట్స్ తో మంచి రెమ్యూనరేషన్ అందుకుంటారు. కాగా పవన్ కళ్యాణ్ చేసే రీమేక్స్ త్రివిక్రమ్ కి సైడ్ బిజినెస్ అవుతున్నాయని, టాలీవుడ్ వర్గాల బోగట్టా. తక్కువలో తక్కువ రూ. 10 నుండి 15 కోట్లు రాబట్టుకుంటున్నారు. 

భీమ్లా నాయక్ తో త్రివిక్రమ్ ఖాతాలో చేరిన డబ్బు రూ. 15 నుండి 20 కోట్లని ఇండస్ట్రీ టాక్. అయ్యప్పనుమ్ కోశియుమ్ రీమేక్ అయిన భీమ్లా నాయక్ కి స్క్రీన్ ప్లే, మాటలు అందించింది త్రివిక్రమే. అనధికారికంగా దర్శకత్వ పర్యవేక్షణ కూడా చేశారు. భీమ్లా నాయక్ నిర్మాణ భాగస్వామిగా కూడా వ్యవహరించిన త్రివిక్రమ్ పెద్ద మొత్తంలో లాభపడ్డారన్న గుసగుసలు వినిపించాయి. 

తాజాగా అలాంటి జాక్ పాట్ వినోదయ సితం రీమేక్ తో తగిలిందంటున్నారు. తమిళ హిట్ మూవీ వినోదయ సితం రీమేక్ లో పవన్ కళ్యాణ్ నటిస్తున్న విషయం తెలిసిందే. సాయి ధరమ్ తేజ్ మరో హీరోగా నటిస్తున్నారు. సముద్ర ఖని దర్శకత్వం వహిస్తున్నారు. ఫిబ్రవరి 14న వినోదయ సితం రెగ్యులర్ షూట్ స్టార్ట్ కానుందన్న ప్రచారం జరుగుతుంది. 

వినోదయ సితం రీమేక్ వద్దంటూ ఫ్యాన్స్ సోషల్ మీడియా వేదికగా నిరసనలు వ్యక్తం చేస్తున్నారు. ఈ కథ మీ ఇమేజ్ కి ఏమాత్రం సరిపోదు. అలాగే గతంలో చేసిన గోపాలా గోపాలా మూవీలా ఉంటుంది. కాబట్టి వినోదయ సితం రీమేక్ ఆలోచన మానుకోండని పవన్ ని అభ్యర్థిస్తున్నారు. అసలు రీమేక్స్ వద్దంటుంటే... మాస్ హీరోయిజం కి ఛాన్స్ లేని సినిమాలు ఎంచుకుంటున్నారంటూ ఒకింత అసహనం తెలుపుతున్నారు. 

కాగా వినోదయ సితం స్క్రిప్ట్ కు త్రివిక్రమ్ సమూల మార్పులు చేశారట. జస్ట్ స్టోరీ లైన్ తీసుకొని సన్నివేశాలు, కథనం పూర్తిగా మార్చేశారట. పవన్ ఫ్యాన్స్ కోరుకునే యాక్షన్, సాంగ్స్, డైలాగ్స్ తో స్క్రిప్ట్ సిద్ధం చేశారట. భీమ్లా నాయక్ తరహాలో ఒరిజినల్ మూవీలో లేని కమర్షియల్ అంశాలు జోడించారట. ఇది ఒకింత ఫ్యాన్స్ కి ఊరట కలిగిస్తుంది. ఇక పవన్ కి ఈ రీమేక్ సినిమాలు సజెస్ట్ చేస్తుంది త్రివిక్రమేనన్న వాదన ఉంది. పవన్ కూడా త్వరగా పూర్తి అవుతాయనే ఆలోచనతో ఓకే చేస్తున్నారు. ఈ క్రమంలో తన అభిమానుల నుంచి సైతం విమర్శలు ఎదుర్కొంటున్నాడు. త్రివిక్రమ్ మాత్రం పవన్ రీమేక్ కథలకు మెరుగులుదిద్దుతూ కోట్లు సంపాదిస్తున్నారని పరిశ్రమ వర్గాలు చెవులు కొరుక్కుంటున్నాయి.