అల్లు అర్జున్ కెరీర్ లో  అతిపెద్ద హిట్ అల వైకుంఠపురంలో. గత ఏడాది సంక్రాంతి కానుకగా విడుదలైన ఈ చిత్రం ఇండస్ట్రీ హిట్ అందుకుంది. అల్లు అర్జున్ కెరీర్ లో మొట్టమొదటి ఇండస్ట్రీ హిట్ అల వైకుంఠపురంలో. ఇంత పెద్ద విజయం సాధించిన ఈ మూవీ విడుదలై జనవరి 11కి ఏడాది పూర్తి అయ్యింది. దీనితో అల వైకుంఠపురంలో మూవీ టీమ్ యానివర్సరీ జరుపుకున్నారు. ఆ చిత్రం ఇచ్చిన విజయాన్ని గుర్తు చేసుకుంటూ ప్రేక్షకులకు ధన్యవాదాలు తెలిపారు. 

కాగా ఈ వేదికలో దర్శకుడు త్రివిక్రమ్ స్పీచ్ అల్లు అర్జున్ ఫ్యాన్స్ కోపానికి కారణం అయ్యింది. అల వైకుంఠపురంలో తన కెరీర్ లో అత్యుత్తమ చిత్రంగా కొనియాడిన త్రివిక్రమ్, దీనిని గతంలో తాను దర్శకత్వం వహించిన అతడు సినిమాతో పోల్చాడు. అతడు ఎన్ని సార్లు బుల్లితెరపై ప్రసారం అయినా, ప్రేక్షకులు కొత్తగా చూస్తారని, అల వైకుంఠపురంలో కూడా అలాంటి చిత్రమే అని ఆయన చెప్పడం జరిగింది. తమ హీరో ఇండస్ట్రీ హిట్ చిత్రాన్ని మహేష్ అతడు తో పోల్చడం అల్లు అర్జున్ ఫ్యాన్స్ కి నచ్చలేదు. 

దానికి కారణం గత ఏడాది మహేష్ సరిలేరు నీకెవ్వరూ, అల్లు అర్జున్ అల వైకుంఠపురంలో ఒక రోజు వ్యవధిలో సంక్రాంతి కానుకగా విడుదల కావడం జరిగింది. థియేటర్స్ సర్దుబాటు విషయంలో ఇరు చిత్రాల మధ్య వివాదం ఏర్పడింది. పరిశ్రమ పెద్దల చొరవతో ఆ గొడవ తీరి సినిమాలు విడుదలయ్యాయి. అయితే కలెక్షన్స్ విషయంలో రెండు చిత్రాలు పోటా పోటీగా పోస్టర్స్ విడుదల చేశాయి. సంక్రాంతి విన్నర్ మేమంటే మేమంటూ పోటీ పడ్డారు. అప్పట్లో ఇది పెద్ద చర్చనీయాంశం అయ్యింది.  ఈ నేపథ్యంలో త్రివిక్రమ్ మాటలు బన్నీ ఫ్యాన్స్ ని హర్ట్ చేశాయి.