దర్శకుడు తేజ తన కొడుకు ఎలా చనిపోయాడో, దానికి కారణం ఎవరో తెలియజేస్తూ ఓ యూట్యూబ్ ఛానెల్ కి అప్పట్లో ఓ ఇంటర్వ్యూ ఇచ్చాడు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో ట్రెండింగ్ అవుతోంది. ఈ ఇంటర్వ్యూలో తన కొడుకు మరణం గురించి తేజ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

తన కొడుక్కి నాలుగేళ్ల వయసులో అనారోగ్యంగా ఉండడంతో హాస్పిటల్ లో చేర్పించామని, ట్రీట్మెంట్ లో డాక్టర్స్ చేసిన మిస్టేక్ కారణంగా అతడి ఆరోగ్య పరిస్థితి విషమించిందని చెప్పారు. తన కొడుకుని కాపాడుకోవడం కోసం జర్మనీ, చైనా దేశాలు తీసుకెళ్లామని.. అయినా బ్రతికించుకోలేకపోయామని అన్నారు.

తన కొడుకు కోసం ఇంటినే హాస్పిటల్ గా మార్చేశామని, నాలుగేళ్ల పాటు సరిగ్గా నిద్రపోలేదని అన్నారు. 24 గంటల పాటు మూడు షిఫ్ట్ లలో ఇద్దరు నర్సులు ఉండేవారని, ఒక డ్రైవర్ ఉండేవారని చెప్పాడు. ఆక్సిజన్ మిషన్, జనరేటర్, క్లీనింగ్ మిషన్ వీటన్నింటితో ఇల్లు హాస్పిటల్ గా ఉండేదని చెప్పారు.

ఆ సమయంలో రాత్రి, పగలూ చాలా కష్టపడ్డామని చెప్పారు. నాలుగేళ్లపాటు సినిమాలు చేయలేదని.. ఆ హాస్పిటల్ పై కేసు వేయమని చాలా మంది చెప్పారని..కేసు వేస్తా కానీ డబ్బుల కోసం కాదు.. నా కొడుకు బతికివస్తాడంటే వేస్తానని వారితో చెప్పినట్లు గుర్తు చేసుకున్నారు.