పాటలకొండ కందికొండ యాదగిరి మరణం పట్ల సినీ ప్రముఖులు చింతిస్తున్నారు. తాజాగా టాలీవుడ్ డైరెక్టర్ సంపత్ నంది (Sampath Nandi) సంతాపం వ్యక్తం చేశారు. ఆయనతో తనకున్న అనుబంధాన్ని తెలుపుతూ నోట్ రాశారు.
తెలుగు చిత్ర పరిశ్రమ సాహిత్య దిగ్గజాలను కోల్పోతోంది. గతేడాది నవంబర్ 30న ప్రముఖ లిరిసిస్ట్ సిరివెన్నెల సీతారామశాస్త్రి (Sirivennela Seetharama Sastry)విశ్రమించారు. అంతకు ముందు ది గ్రేట్ సింగర్ ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం కూడా మరణించడంతో తెలుగు చలన చిత్ర పరిశ్రమలో తీవ్ర విషాద ఛాయలు నెలకొన్నాయి. కాగా నిన్న హైదరాబాద్ లోని వెంగళరావు నగర్ లో ప్రముఖ లిరిసిస్ట్, రచయిత కందికొండ యాదగిరి (Kandikonda Yadagiri) తుదిశ్వాస విడిచారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన మరణం సినీ ప్రముఖులను కలిచివేస్తోంది. ఈ సందర్భంగా సోషల్ మీడియా వేదికన తమ ప్రగాఢ సానుభూతి, సంతాపం వ్యక్తం చేస్తున్నారు.
తాజా టాలీవుడ్ డైరెక్టర్ సంపత్ నంది నివాళి అర్పించారు. కందికొండతో తనకున్న అనుబంధాన్ని ఇన్ స్టా నోట్ లో రాసి నెటిజన్లతో పంచుకున్నాడు. ‘కందికొండ గారూ మిమ్మల్ని కోల్పోవడం చాలా బాధగా ఉంది. నా మొదటి సినిమా ‘ఏమైంది ఈ వేళలో’ మీకు పని చేసే అవకాశం వచ్చింది. మన సంభాషణలు మరియు మీరు మీ సాధారణ పంక్తులతో ఆ చిత్ర సారాంశాన్ని తెలియజేసే విధానం విలువైనదిగా భావిస్తాను. నేను ఎప్పటికీ మిమ్మల్ని మరిచిపోలేను. మిమ్మల్ని కోల్పోయినందుకు బాధాగా ఉంది. ఆ స్వర్గలోకంలో మీరు ప్రశాంతంగా ఉండాలి’. అంటూ ఎమోషన్ నోట్ రాసుకొచ్చాడు.
సినీ ప్రముఖులు, కళాకారుల సందర్శనార్థం ఈ రోజు ఉదయం మోతీనగర్ నుంచి ఫిల్మ్ ఛాంబర్ కు కందికొండ భౌతిక కాయాన్ని తరలించారు. ఫిల్మ్ మహాప్రస్థానంలో అంత్యక్రియలు నిర్వహించనున్నారు. అయితే ఫిల్మ్ ఛాంబర్ వద్ద కందికొండ భౌతిక కాయానికి కనీస ఏర్పాట్లు చేయలేదని, కనీసం ఫ్రీజర్ కూడా ఏర్పాలు చేయకపోవడం పట్ల ఆయన మిత్రులు, అభిమానులు అసహనం వ్యక్తం చేశారు. గొప్ప సాహిత్య కారుడికి న్యాయం చేయాలని, ఆయన కుటుంబాన్ని అన్ని విధాలా ఆదుకోవాలని డిమాండ్ చేశారు. పాటలకొండ కందికొండ తన కేరీర్ లో మొత్తంగా 1300కు పైగా పాటలకు సాహిత్యం అందించారు. అటు సినిమాల్లో పనిచేస్తూ, తెలంగాణ జానపద గీతాలకు కూడా మంచి లిరిక్స్ అందించారు.
