ప్రముఖ వివాదాస్పద దర్శకుడు రామ్‌గోపాల్‌ వర్మకి వరుసకు సోదరుడైన పి.సోమశేఖర్‌ కరోనాతో కన్నుమూశారు. వర్మ వద్ద సోమశేఖర్‌ పలు సినిమాలకు పనిచేశారు. ఆర్‌జీవీ రూపొందించిన `రంగీలా`, `దౌడ్‌`, `సత్య`, `జంగిల్‌`, `కంపెనీ` సినిమాలకు ప్రొడక్షన్‌ బాధ్యతలు నిర్వర్తించాడు. హిందీలో `ముస్కురాకే దేఖ్‌ జరా` చిత్రానికి దర్శకత్వం కూడా వహించారు. సోమశేఖర్‌ సినిమాల నుంచి ఇతర వ్యాపారాల్లోకి వెళ్లడంతో వర్మకి దూరంగా ఉంటున్నారు. 

అయితే తన జీవితంలో ముఖ్యమైన వ్యక్తుల్లో సోమశేఖర్‌ ఒకరని, అతడిని చాలా మిస్‌ అవుతున్నానని ఆర్జీవి చాలా సందర్భాల్లో తెలిపారు. `సత్య` షూటింగ్‌ సమయంలో ఆర్జీవి కంటే శేఖర్‌ని చూస్తే ఎక్కువ భయం వేసేదని హీరో జేడీ చక్రవర్తి గతంలో ఓ ఇంటర్వ్యూలో తెలిపారు. తాజాగా బోనీ కపూర్‌.. సోమశేఖర్‌ మృతిపై స్పందించారు. `ఆయన తల్లి విషయంలో ఎన్నో జాగ్రత్తలు తీసుకునేవారని, కరోనా సోకిన తర్వాత కూడా తల్లి కోసం ఎంతో పరితపించేవాడు. తన తల్లిని కాపాడగలిగాడు గానీ, తన ప్రాణాలు కాపాడుకోలేకపోయాడు` అని తెలిపారు.