కరోనా మహమ్మారి ప్రపంచ దేశాలను వణికిస్తోంది. కంటికి కనిపించిన వైరస్‌ మానవాళికి కంటిమీద కునుకు లేకుండా చేస్తోంది. దీంతో ప్రజలకు కరోనాను ఎదుర్కోనేందుకు సరికొత్త అలవాట్లు నేర్చుకోక తప్పని పరిస్థితి ఎదురైంది. ముఖ్యంగా ప్రతీ ఒక్కరు మాస్క్ ధరించాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఒకరి నుంచి ఒకరికి వేగంగా సంక్రమించే ఈ వైరస్‌కు అడ్డుకట్ట వేసేందుకు ప్రభుత్వాలు మాస్క్ వినియోగం తప్పని సరి చేశాయి. మాస్క్ ధరించకుండా బయటకు వస్తే ఫైన్లు వేస్తున్నాయి ప్రభుత్వాలు.

ఈ నేపథ్యంలో ప్రజల్లో మాస్క్ వినియోగం పట్ల అవగాహన కల్పించేందుకు దర్శక ధీరుడు రాజమౌళి ముందుకు వచ్చాడు. బాహుబలి 2 సినిమాలో క్లైమాక్స్ సీన్‌లో హీరో విలన్లు దగ్గరకు వచ్చే సన్నివేశంలో వారు ఇద్దరు మాస్క్‌లు ధరించినట్టుగా గ్రాఫిక్స్‌ చేయించి ఆ వీడియోను తన సోషల్ మీడియా పేజ్‌లో షేర్ చేశాడు జక్కన్న. ఈ వీడియోలో మాహిష్మతిలో సైతం మాస్కులు తప్పనిసరి అనే సందేశం ఇచ్చాడు రాజమౌళి. యునైటెడ్‌ సాఫ్ట్‌ వీఎఫ్‌ఎక్స్‌ స్టూడియో ఈ గ్రాఫిక్స్‌ చేసింది వారికి కూడా కృతజ్ఞతలు తెలిపారు రాజమౌళి. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.

ఇక సినిమాల విషయానికి వస్తే బాహుబలి తరువాత మరో భారీ చిత్రాన్ని ప్రారంభించాడు రాజమౌళి. ఎన్టీఆర్, రామ్‌ చరణ్‌లు హీరోలుగా పీరియాడిక్‌ ఫాంటసీ డ్రామాను తెరకెక్కిస్తున్నాడు. దాదాపు 400 కోట్ల బడ్జెట్‌తో రూపొందుతున్న ఈ సినిమా లాక్‌ డౌన్‌ కారణంగా ఆగిపోయింది. షూటింగ్ తిరిగి ప్రారంభించేందుకు కోవిడ్‌ నిబంధనలు పాటిస్తూ ఓ డెమో చేసేందుకు కూడా రాజమౌళి ప్రయత్నించాడు. అయితే అది కూడా వర్క్‌ అవ్వలేదని తెలుస్తోంది.