దర్శకధీరుడు రాజమౌళి కరోనాని జయించాడు. మొత్తానికి వైరస్‌ పై విజయం సాధించాడు. రెండు వారాల క్వారంటైన్‌ అనంతరం ఆయనకు కరోనా నెగటివ్‌ వచ్చింది. ఆయనకే కాదు వారి కుటుంబ సభ్యులకు కూడా నెగటివ్‌ వచ్చినట్టు నిర్ధారించుకున్నారు. ఈ విషయాన్ని రాజమౌళి ట్విట్టర్‌ వేదికగా ప్రకటించారు. 

`రెండు వారాల క్వారంటైన్‌ పూర్తయ్యింది. ఎలాంటి లక్షణాలు కనిపించడం లేదు. టెస్ట్ చేయించుకుంటే మా అందరికి నెగటివ్‌ అని తేలింది. ప్లాస్మా దానం చేసేందుకు తగినన్ని ఆంటీ బాడీస్‌ అభివృద్ధి చెందుతున్నాయో లేదో చూసేందుకు మూడు వారాల టైమ్‌ పడుతుందని డాక్టర్‌ చెప్పారు. ఆ తర్వాత ప్లాస్మా డొనేట్‌ చేస్తాం` అని తెలిపారు. 

రాజమౌళి ఈ ప్రకటనతో ఇప్పుదంతా ఊపిరి పీల్చుకున్నారు. ముఖ్యంగా `ఆర్‌ ఆర్‌ ఆర్‌` టీమ్‌ రిలాక్స్ అయ్యింది. ఎన్టీఆర్‌, రామ్‌చరణ్‌ కాస్త కుదుట పడ్డారు. ఇక `ఆర్‌ ఆర్‌ ఆర్‌` అభిమానులు ప్రపంచాన్ని జయించినంతగా ఫీల్‌ అవుతున్నారు. ఇదిలా ఉంటే గత వారం `ఆర్‌ ఆర్‌ ఆర్‌` నిర్మాత డివివి దానయ్యకి సైతం కరోనా పాజిటివ్‌ వచ్చిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఆయన ట్రీట్‌మెంట్‌ తీసుకుంటున్నారు. ఆయన కూడా త్వరగా కోలుకోవాలని అభిమానులు కోరుతున్నారు. 

రాజమౌళి దర్శకత్వంలో ప్రస్తుతం `ఆర్‌ ఆర్‌ ఆర్‌`  సినిమా రూపొందుతుంది. భారీ బడ్జెట్‌తో, మల్టీస్టారర్‌గా తెరకెక్కుతున్న ఈ చిత్రానికి డివివి దానయ్య నిర్మాత. ఇక రామ్‌చరణ్‌, ఎన్టీఆర్‌ హీరోలుగా, బాలీవుడ్‌ నటి అలియాభట్‌, బ్రిటీష్‌ నటి ఒలీవియా మోర్రిస్‌ హీరోయిన్లుగా.. అజయ్‌ దేవగన్‌, సముద్రఖని కీలక పాత్రధారులుగా పాన్‌ ఇండియా చిత్రంగా రూపొందుతుంది.