ప్రభాస్‌ ఇటీవల మరో భారీ సినిమాని ప్రకటించారు. `కేజీఎఫ్‌` ఫేమ్‌ ప్రశాంత్‌ నీల్‌ దర్శకత్వంలో ఉంటుందని వెల్లడించారు. దీనికి `సలార్‌` అనే టైటిల్‌ని ఫిక్స్ చేశారు. అయితే `సలార్‌` అంటే అర్థం ఏంటనేది ఇప్పుడు అందరిని వెంటాడుతుంది. `నాయకుడు` అని, ప్రజలను నడిపించేవాడు` అని ఇలా రకరకాల అర్థాలు వినిపించాయి. జాతీయ మీడియా సైతం దీనిపై తన సందేహాన్ని వెల్లడించింది. 

ఎక్కడ చూసినా దీనికి సంబంధించిన చర్చ జరుగుతుంది. దీంతో ఎట్టకేలకు దర్శకుడు ప్రశాంత్‌ నీల్‌ స్పందించారు. `సలార్‌` అంటే అర్థం ఏంటనేది చెప్పడంతోపాటు ప్రభాస్‌ని తీసుకోవడానికి కారణాలను కూడా వెల్లడించారు. 

`సలార్‌` టైటిల్‌కి ఎంతో మంది రకరకాల అర్థాలు చెబుతున్నారు. అది ఒక సామాన్యమైన పదం. ఉర్దూ భాష ప్రకారం `సలార్‌` అంటే సమర్థవంతమైన నాయకుడు అని అర్థం. రాజుకి కుడి భుజంగా ఉంటూ, ప్రజల సంరక్షణ కోసం పాటుపడే వ్యక్తి అని కూడా చెప్పొచ్చు. ఓ వైలెంట్‌ పాత్రని మీ ముందుకు తీసుకురానున్నాను. కథని ప్రతిబింబించేలా ఫస్ట్ లుక్‌ని తీర్చిదిద్దాం. ప్రభాస్‌ లుక్‌ చూసి ఆయన ఆర్మీలో ఉండే వ్యక్తి అని అంతా అనుకుంటారనే ఫస్ట్ లుక్‌లో టైటిల్‌తో విడుదల చేశాం` అని దర్శకుడు ప్రశాంత్‌ నీల్‌ చెప్పారు. 

ఇక ప్రభాస్‌ని తీసుకోవడానికి గత కారణాలను చెబుతూ, `నాకు `ఉగ్రం`, `కేజీఎఫ్‌`తో కన్నడ చిత్ర పరిశ్రమలో మంచి గుర్తింపు వచ్చింది. కన్నడ హీరోని కాకుండా, తెలుగు హీరోని తీసుకోవడానికి కారణమేంటని అంతా అడుగుతున్నారు. నేను రాసుకున్న `సలార్‌` కథకి ప్రభాస్‌ సరిగ్గా సరిపోతాడని నాకు అనిపించింది. అందుకే ఆయనతో ఈ సినిమా చేస్తున్నా` అని తెలిపారు. ఈ చిత్రాన్ని హోంబలే ఫిల్మ్స్ పతాకంపై విజయ్‌ కిరంగుదూర్‌ నిర్మిస్తున్నారు.