సూపర్ స్టార్ రజినీకాంత్ ప్రధాన పాత్రలో 'కబాలి', 'కాలా' వంటి సినిమాలను రూపొందించిన దర్శకుడు పా.రంజిత్ ని పోలీసులుఅరెస్ట్ చేసే సూచనలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. దానికి కారణం ఇటీవల తంజావూరు జిల్లాలో ఏర్పాటు చేసిన ఓ దళిత సభలో పాల్గొన్న ఆయన రాజ రాజ చోళుడు గురించి నెగెటివ్ గా మాట్లాడారు.

తమిళ జనాల్లో ఎక్కువ శాతం మంది చోళ చక్రవర్తిని గొప్ప వ్యక్తిగా, దేవుడిగా భావిస్తున్నారు. అయితే రాజ చోళుడు అందరూ అనుకుంటున్నట్లు మంచి వాడు కాదని.. చరిత్రను లోతుగా అధ్యయనం చేస్తే అతడి గురించి నిజాలు తెలుస్తాయని పా.రంజిత్ అన్నారు.

చోళుడు తన పాలనలో తక్కువ కులాల వారి భూములను లాక్కున్నారని, దాదాపు నాలుగు వందల మందిని దేవదాసీలుగా మార్చారని, ఆయన పాలనలో చీకటి కోణాలు చాలా ఉన్నాయని అన్నారు. రంజిత్ చేసిన ఈ వ్యాఖ్యలపై హిందూ సంఘాలు తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ఆయన వ్యాఖ్యలు తమ మనోభావాలను దెబ్బతీసే విధంగా ఉన్నాయంటూ పోలీసులకు ఫిర్యాదు చేశారు.

దీంతో రంజిత్ పై పలు కేసులు నమోదయ్యాయి. విషయం తెలుసుకున్న రంజిత్ ముందస్తు బెయిల్ కోసం ప్రయత్నించగా.. కోర్టు తిరస్కరించింది. పోలీసులు పా.రంజిత్ ని పిలిపించి తను చేసిన వ్యాఖ్యలపైవివరణ అడగనున్నారు. వారు సంతృప్తి చెందకుంటే అరెస్ట్ చేస్తారనే టాక్ ఇండస్ట్రీలో వినిపిస్తుంది.