ఇటీవల `ది వారియర్స్ `తో పరాజయాన్ని చవిచూసిన దర్శకుడు లింగుస్వామి ఇప్పుడు హిట్‌కి సీక్వెల్‌ చేసే ప్లాన్‌లో ఉన్నారు. `ఆవారా`కి సీక్వెల్‌ చేయబోతున్నారు.

కార్తీకి తెలుగులో మంచి గుర్తింపు తీసుకొచ్చిన చిత్రం `ఆవారా`. ఈ సినిమాతో తెలుగులో కార్తికి మంచి మార్కెట్‌ ఏర్పడింది. ఈ చిత్రంలో తమన్నా కథానాయికగా నటించగా, లింగుస్వామి దర్శకత్వం వహించారు. `పయ్యా` అనే టైటిల్‌తో తమిళంలో రూపొందగా, ఇది `ఆవారా`గా తెలుగులో విడుదలైంది. పెద్ద హిట్‌ అయ్యింది. 2010లోనే ఈ సినిమా సుమారు 13కోట్లు వసూలు చేసింది. ఈ సినిమా సక్సెస్‌తో తెలుగులో వరుసగా తన సినిమాలను రిలీజ్‌ చేస్తున్నారు హీరో కార్తి. ఆ తర్వాత వరుసగా సినిమాలు చేస్తూ రాణిస్తున్నారు.

కార్తి నటించే ప్రతి సినిమా తెలుగు, తమిళంలో ఏక కాలంలో విడుదల అవుతుండటం విశేషం. మంచి వసూళ్లని రాబడుతున్నాయి. ఇదిలా ఉంటే ఇప్పుడు `ఆవారా`కి సీక్వెల్‌ ప్లాన్‌ చేస్తున్నారు దర్శకుడు లింగుస్వామి. `పందెంకొడి` చిత్రంతో దర్శకుడిగా ఆయన తనేంటో నిరూపించుకున్నారు. ఇటీవల రామ్‌ హీరోగా `ది వారియర్స్` మూవీని తెరకెక్కించారు. కానీ ఆయన రూపొందించిన `పందెంకోడి 2`, `ది వారియర్స్` సైతం పరాజయం చెందింది. ఈ నేపథ్యంలో దర్శకుడిగా తానేంటో నిరూపించుకోవాల్సిన టైమ్‌ వచ్చింది. అందుకే `ఆవారా` సీక్వెల్‌ని చేయబోతున్నారట. 

సీక్వెల్‌ కథని కార్తి, సూర్యలకు చెప్పారు లింగుస్వామి. కానీ వాళ్లు నో చెప్పారు. దీంతో మరో హీరో ఆర్యకి చెప్పగా, ఆయన ఓకే చేశారని సమాచారం. దీంతో `ఆవారా2`ని పట్టాలెక్కించే పనిలో దర్శకుడు బిజీ అయ్యారు. అంతేకాదు కాస్టింగ్‌, టెక్నీషియన్లని ఎంపిక చేసే పనిలో పడ్డారు. అయితే హీరోయిన్‌గా పూజా హెగ్డేతో చర్చలు జరుపుతున్నారట. ఆమె గ్రీన్‌ సిగ్నల్‌ ఇస్తుందా? లేదా అనేది సందేహం నెలకొంది. ఒకవేళ పూజా ఓకే చెబితే ఈ సినిమాకి మంచి క్రేజ్‌ నెలకొంటుందని చెప్పొచ్చు. మరి ఇది ఎప్పుడు కార్యరూపం దాల్చుతుంది, ఎప్పుడు పట్టాలెక్కుతుందనేది చూడాలి.