సారాంశం
దర్శకుడు క్రిష్ హరి హర వీరమల్లులో లాక్ అయిపోయాడు. ఆ ప్రాజెక్ట్ ని పవన్ లైట్ తీసుకున్నట్లు అనిపిస్తుండగా... ఆయనకు విడుదలెప్పుడో తెలియడం లేదు.
హరి హర వీరమల్లు పట్టాలెక్కి దాదాపు మూడు ఏళ్ళు కావస్తుంది. షూటింగ్ చివరి దశకు రాలేదు. పీరియాడిక్ మూవీ కావడంతో సెట్స్, గెటప్స్ కి టైం పడుతుంది. దానికి తోడు పవన్ కళ్యాణ్ సహకారం అంతంత మాత్రంగా ఉంది. హరి హర మల్లు వరుస షెడ్యూల్స్ లో ప్లాన్ చేసి పూర్తి చేస్తే సరిపోతుంది. అలా జరగడం లేదు. భారీ బడ్జెట్ మూవీ కావడంతో నిర్మాణ వ్యయం కూడా దాటిపోయిందని సమాచారం.
లాక్ డౌన్ సమయంలో సైలెంట్ గా కొండపొలం మూవీ కంప్లీట్ చేశాడు క్రిష్. ఆ మూవీ విడుదలై ఏడాదిన్నర కావస్తుంది. హరి హర వీరమల్లు నుండి మాత్రం క్రిష్ కి విడుదల లేదు. మూవీ మొదలుపెడితే వేగంగా కంప్లీట్ చేయడం క్రిష్ కి అలవాటు. గౌతమీ పుత్ర శాతకర్ణి వంటి పీరియాడిక్ మూవీని కూడా తక్కువ రోజుల్లో షూట్ చేశాడు. హరి హర వీరమల్లు విషయంలో ఆయన పని నత్తనడక సాగుతుంది.
దీనికి పవన్ సహకరించకపోవడం ప్రధాన కారణం. పవన్ మనసులో ఏముందో కానీ హరి హర మల్లు పూర్తి చేయాలనే ఆలోచన చేయడం లేదు. హరి హర వీరమల్లు పక్కన పెట్టి భీమ్లా నాయక్ వరుస షెడ్యూల్స్ లో పూర్తి చేశాడు. ప్రస్తుతం ఏకంగా మూడు కొత్త సినిమాల షూటింగ్లో పాల్గొంటున్నారు. బ్రో, ఓజీ, ఉస్తాద్ భగత్ సింగ్ చిత్రాల షూటింగ్ పరుగులు పెట్టిస్తున్నారు.
పవన్ తో మూవీ చేసే ఛాన్స్ దొరికిందని సంతోషించిన క్రిష్ కి నిరాశే మిగిలింది. సార్వత్రిక ఎన్నికలకు ఏడాది సమయం కూడా లేదు. ఆ మూడు చిత్రాలకు సమయం కేటాయించడమే ఎక్కువ. హరి హర వీరమల్లుకు మోక్షం దక్కే సూచనలు లేవు. 2024లోనే పవన్ ఈ చిత్రాన్ని పూర్తి చేయవచ్చు.