'మణికర్ణిక' సినిమా వివాదంపై ఇంతకాలంగా సైలెంట్ గా ఉన్న దర్శకుడు క్రిష్ ఇప్పుడు నోరు విప్పాడు. హీరోయిన్ కంగనా నిర్మాతలతో కుట్ర పన్ని తనను సినిమా నుండి బయటకి వెళ్లిపోయేలా చేసిందని అంటున్నాడు దర్శకుడు క్రిష్.

దాదాపుగా సినిమా మొత్తం పూర్తి చేసి క్రిష్ బయటకి రాగా.. కొన్ని సన్నివేశాలకు దర్శకత్వం వహించి దర్శకురాలిగా క్రెడిట్ తీసేసుకుంది కంగనా.. ఎట్టకేలకు ఈ విషయంపై స్పందించాడు దర్శకుడు క్రిష్. సినిమాకు సంబంధించి కొంత వర్క్ కంగనా చేసిందని, మెజారిటీ వర్క్ తనదేనని అంటున్నాడు.

తను షూట్ చేసిన సన్నివేశాలను, కావాలని మళ్లీ రీషూట్ చేసి డైరెక్టర్ గా తన పేరు వేసుకుంటోందని క్రిష్ అన్నాడు. తాను సినిమా నుండి బయటకి ఎందుకు రావాల్సి వచ్చిందనే విషయాన్ని వెల్లడిస్తూ.. ''సోనూసూద్ పాత్ర తగ్గించాలని, ఫస్ట్ హాఫ్ లోనే ఆ పాత్రను చంపేయాలని కంగనా కోరింది. కానీ దానికి నిరాకరించడంతో.. అదే ప్రతిపాదనతో ఆమె నిర్మాతల వద్దకు వెళ్లింది. వాళ్లు కూడా ఆమెకు వంత పాడడంతో అలాంటి మార్పులు చేయడం ఇష్టం లేక నేను సినిమా నుండి తప్పుకున్నాను'' అంటూ క్రిష్ వెల్లడించాడు.

ఆ తరువాత ప్రాజెక్ట్ కంగనా చేతుల్లోకి వెళ్లిందని క్రిష్ తెలిపాడు. తను చిత్రీకరించిన వెర్షన్ ను చూసి కంగాన కామెంట్స్ చేసేదని.. భోజ్ పురి సినిమాలా ఉందనేదని క్రిష్ చెప్పాడు. తనకు ఇవ్వాల్సిన రెమ్యునరేషన్ లో ముప్పై శాతం మాత్రమే ఇచ్చి ఊరుకున్నారని మరో షాకింగ్ విషయాన్ని వెల్లడించాడు.