టాలీవుడ్ లో దర్శకుడు క్రిష్ కి మంచి పేరుంది. వైవిధ్యమైన చిత్రాలను రూపొందించడంలో సిద్ధహస్తుడు. 'గమ్యం', 'వేదం', 'కంచె' ఇలా ఆయన డైరెక్ట్ చేసిన ఏ సినిమా చూసిన అందులో ఓ కొత్త అంశం కనిపిస్తుంటుంది. 

రీసెంట్ గా ఆయన డైరెక్ట్ చేసిన ఎన్టీఆర్ బయోపిక్ మొదటిభాగం 'కథానాయకుడు' ప్రేక్షకుల ముందుకు వచ్చి సక్సెస్ అందుకుంది. ఈ సందర్భంగా క్రిష్ మీడియాతో ముచ్చటించారు. ఈ క్రమంలో అతడిని వ్యక్తిగత జీవితం గురించి ప్రశ్నించింది మీడియా.

గత కొంతకాలంగా క్రిష్ తన భార్యతో కలిసి ఉండడం లేదని, ఇద్దరూ విడాకులు తీసుకోబోతున్నారంటూ వార్తలు వచ్చాయి. ఇదే విషయమై క్రిష్ వద్ద ప్రస్తావించగా.. పెళ్లి పూర్తిగా తన వ్యక్తిగత విషయమని ఆయన అన్నారు. 

వ్యక్తిగత ఇబ్బందులు, మానసిక ఒత్తిడి గురించి ఆయన మాట్లాడుతూ.. ''ఎలాంటి బాధనైనా మరిపించేది పని మాత్రమేనని ఎన్టీఆర్ కథానాయకుడులో ఒక డైలాగ్ ఉంది. ప్రతి ఒక్కరికీ వ్యక్తిగత విషయాలు ఉంటాయి. పెళ్లి నా వ్యక్తిగత విషయం'' అంటూ స్పష్టం చేశారు.

ఫిబ్రవరి మొదటి వారంలో ఎన్టీఆర్ బయోపిక్ రెండో భాగం 'మహానాయకుడు' ప్రేక్షకుల ముందుకు  రానుంది.