నాని నటించిన అంటే సుందరానికీ మూవీ ఈవెంట్ లో పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ గోల నెక్స్ట్ లెవెల్ కి చేరింది. ఈ క్రమంలో దర్శకుడు హరీష్ శంకర్ స్టేజ్ పై ఓపెన్ అయ్యారు. మీరు ఇలా అల్లరి చేయడం సరికాదని హెచ్చరించారు.


వేరే హీరో ఈవెంట్ కి పవన్ కళ్యాణ్ వస్తున్నాడంటే చాలు.. ఆ మూవీ యూనిట్ మొత్తం ఓ టెన్షన్ లో ఉంటారు. పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ చేసే హంగామా ఎలా ఉంటుందో తలచుకొని కంగారు పడతారు. వేదికపై ఎవరినీ మాట్లాడనివ్వకుండా పవన్ పేరున స్లోగన్ చేయడం వారికి పరిపాటి. పెద్ద పెద్ద శబ్దాలతో నటులను, సాంకేతిక నిపుణులను అసలు మాట్లాడనివ్వరు. తమ స్పీచ్ మొత్తం పవన్ గురించే మాట్లాడాలి అన్నట్లు ప్రవర్తిస్తారు. 

అంటే సుందరానికీ ప్రీ రిలీజ్ ఈవెంట్(Ante Sundaraniki prerelease event) కి పవన్ కళ్యాణ్ గెస్ట్ గా వచ్చారు. ఇక ఈ ఈవెంట్ లో పవన్ ఫ్యాన్స్ అల్లరి ఆయన రాకముందే మొదలైంది. నటుడు నరేష్ మాట్లాడుతుండగా పెద్ద ఎత్తున స్లోగన్స్ చేశారు. అలాగే ఇతర నటులు మాట్లాడేటప్పుడు అదే స్థాయిలో గోల చేయడం జరిగింది. ఇదంతా గమనిస్తున్న దర్శకుడు హరీష్ శంకర్ బరస్ట్ అయ్యారు. పవన్ ఫ్యాన్స్ కి స్వీట్ వార్నింగ్ ఇచ్చారు. 

ఇతర హీరోల సినిమా ఈవెంట్స్ కి పవన్ కళ్యాణ్ వచ్చినప్పుడు ఫ్యాన్స్ సంయమనం పాటించాలి. అల్లరి చేయకుండా పద్ధతిగా ఉండాలి. ఇతర హీరోలు, నటులు మాట్లాడేటప్పుడు మీరు అల్లరి చేస్తే.. పవన్ ఈవెంట్స్ కి రావడం మానేస్తారు. అప్పుడు మనం ఇక యూట్యూబ్ లో ఆయన పాత వీడియోలు చూసుకోవాల్సి వస్తుంది. కాబట్టి మీరు అల్లరి చేయకుండా ఉండాలి అని చెప్పుకొచ్చారు. 

అనంతరం హీరో నాని, హీరోయిన్ నజ్రియాలతో పాటు అంటే సుందరానికీ నటీనటులపై ఆయన ప్రశంసలు కురిపించారు. కేవలం పాత్రలు మాత్రమే కనిపించాయి. నటులు కనిపించలేదని గొప్పగా పొగిడారు. దర్శకుడు వివేక్ ఆత్రేయ, సంగీత దర్శకుడు వివేక్ సాగర్ లను ప్రత్యేకంగా అభినందించారు. సినిమా మంచి విజయం సాధించాలని విషెష్ తెలియజేశారు.