Dimple Hayathi : ఈమధ్య వరుస వివాదాలతో హాట్ టాపిక్ గా నిలిచింది హీరోయిన్ డింపుల్ హయతి . గతంలో ఐపీఎస్ అధికారితోనే గొడవకు దిగిన ఈనటి తాజాగా మరో దుమారమే రేపింది.
వివాదంలో డింపుల్ హయతి
కొన్నాళ్ల క్రితం ఓ ఐపీఎస్ అధికారితో పార్కింగ్ విషయంపై తలెత్తిన వివాదంలో పెద్ద దుమారమే రేపిన డింపుల్ హయాతి, అప్పటినుంచి ఎక్కువగా సినిమాల్లో కనిపించడంలేదు. అవకాశాలు కూడా రావడంలేదని తెలుస్తోంది. అయితే అప్పటినుంచి ఫోటోషూట్లు, ట్రిప్పులతో బిజీగా గడిపిన ఆమె, చివరకు "రామబాణం" అనే సినిమాలో కనిపించింది. అయితే ఆ సినిమా ఆశించిన స్థాయిలో ఫలితాన్ని ఇవ్వకపోవడంతో, డింపుల్‌కు కొత్త అవకాశాల కోసం దాదాపు ఏడాది పైగా ఎదురు చూస్తోంది.
ఇక రీసెంట్ గా శర్వానంద్ సరసన "భోగి" అనే సినిమాకు సైన్ చేసింది డింపుల్, ఈ మూవీ సంపత్ నంది దర్శకత్వంలో తెరకెక్కనుండగా, త్వరలోనే షూటింగ్ ప్రారంభం కానుంది. ఈ సినిమాతో మళ్లీ ఫుల్ బిజీ కావాలని చూస్తున్న తరుణంలో మరో వివాదంలో చిక్కుకుంది. డింపుల్ హయాతి ఇటీవల షేక్‌పేటలోని వంశీరామ్ వెస్ట్ వుడ్స్ అపార్ట్మెంట్‌కు షిఫ్ట్ అయిన విషయం తెలిసిందే. అక్కడ ఆమె పెంపుడు కుక్కల సంరక్షణ కోసం ఇద్దరు యువతులను హోమ్ స్టాఫ్‌గా నియమించుకుంది. అయితే, వారిని ఆమె సరిగ్గా చూసుకోకుండా, హింసించినట్టు ఒక మహిళ సోషల్ మీడియాలో వీడియో పోస్టు చేయడం వివాదానికి దారితీసింది.
అసలు విషయం
అసలు విషయం ఏమంటే, ఆ యువతులను ఉద్యోగానికి పంపిన మహిళ, డింపుల్ కుటుంబం తీరుపై ఆవేదన వ్యక్తం చేస్తూ వీడియోలో పేర్కొంది. తన భర్తపై అవమానకరంగా వ్యాఖ్యలు చేశాడని, అమ్మాయిలను మానసికంగా వేధించారన్న ఆరోపణలు చేసింది. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ నేపథ్యంలో, ఆ మహిళ తన వ్యాఖ్యల్లో “డింపుల్ భర్త” అనే పదాన్ని ప్రస్తావించడంతో, డింపుల్ హయాతి నిజంగా పెళ్లి చేసుకుందా? ఆమెతో కలిసి ఉన్న వ్యక్తి ఎవరు? అనే ప్రశ్నలు నెటిజన్లలో ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి.
ఇప్పటి వరకు డింపుల్ ఈ ఆరోపణలపై స్పందించకపోవడం మరింత ఊహాగానాలకు తావిస్తోంది. డింపుల్ హయతీ ఎప్పుడు పెళ్లి చేసుకుంది. ఆ వ్యక్తి ఎవరు అనేది మరింత ఇంట్రెస్టింగ్ గా మారింది. డింపుల్ హయాతి ఈ ఆరోపణలపై ఏ విధంగా స్పందించనుంది? ఆమె పెళ్లి సంగతి నిజమేనా? అనే అంశాలపై స్పష్టత రావాల్సి ఉంది.
