గత కొన్ని రోజులుగా పార్లమెంట్ లో సినిమాటోగ్రఫీ సవరణ బిల్ పై చర్చ జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో బిల్లులో అనేక సవరణలకు పార్లమెంట్ ఆమోదం తెలిపింది.

గత కొన్ని రోజులుగా పార్లమెంట్ లో సినిమాటోగ్రఫీ సవరణ బిల్ పై చర్చ జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో బిల్లులో అనేక సవరణలకు పార్లమెంట్ ఆమోదం తెలిపింది. సినిమాటోగ్రఫీ సవరణ బిల్ 2023 ప్రకారం ఈ మార్పులు,నిబంధనలు అమలులోకి రానున్నాయి. 

ఈ సందర్భంగా ఇటీవల ఫిలిం ఛాంబర్ అధ్యక్షుడిగా ఎన్నికైన స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు బిల్ పై స్పందించారు. ఫిలిం ఛాంబర్ అధ్యక్షుడిగా అధికారిక ప్రకటన విడుదల చేశారు. ఈ ప్రకటనలో దిల్ రాజు ప్రధాని నరేంద్ర మోడీకి, కేంద్ర సమాచార శాఖా మంత్రి అనురాగ్ ఠాకూర్ కి, సహాయక మంత్రి మురుగన్ కి కృతజ్ఞతలు తెలిపారు. 

'సినిమాటోగ్రఫీ సవరణ బిల్ 2023' ను, 31-07-2023 తేదీన పార్లమెంట్ లో ఆమోదించినందులకు తెలుగు చలన చిత్ర పరిశ్రమ తరపున భారతదేశ ప్రధాని శ్రీ నరేంద్ర మోడీ, కేంద్ర సమాచార శాఖ మాత్యులు శ్రీ అనురాగ్ ఠాకూర్, Dr. L.O. మురుగన్, కేంద్ర సమాచార శాఖ సహాయ మంత్రి వర్యులు గారికి మా హృదయ పూర్వక కృతజ్ఞతలు తెలియచేయుచున్నాము.ఇది నిర్మాతలకు గణనీయంగా సహాయం చేస్తుంది మరియు వారి చిత్రాలను కాపాడుకోవడానికి మరియు వారి ఆశించిన ఆదాయాలను అందుకోవడానికి వారికి అవకాశం వుండగలదు.

ఈ విషయంలో మాకు సహకరించిన శ్రీ అపూర్వ చంద్ర, కార్యదర్శి, కేంద్ర సమాచారశాఖ, శ్రీ రవీంద్ర భాకర్, సీఈఓ, సెంట్రల్ బోర్డు అఫ్ ఫిలిం సర్టిఫికేషన్ మరియు శ్రీమతి షిఫాలీ కుమార్, రీజినల్ ఆఫీసర్, సెంట్రల్ బోర్డు అఫ్ ఫిలిం సర్టిఫికేషన్, హైదరాబాద్ వారికి కృతజ్ఞతలు తెలియచేయుచున్నాము అంటూ తెలుగు ఫిలింఛాంబర్ అధ్యక్షుడిగా దిల్ రాజు స్టేట్మెంట్ ఇచ్చారు. ఈ ప్రకటన దిల్ రాజు అసలు పేరు వి. వెంకటరమణారెడ్డి పేరుపై విడుదలయింది. 

సినిమాటోగ్రఫీ సవరణ బిల్ 2023 ప్రకారం అనేక సవరణలు జరిగాయి. వాటిలో నిర్మాతలు హర్షించే కొన్ని నిర్ణయాలు ఉన్నాయి. సినిమా పైరసీ చేసే వారికి 3 ఏళ్ల జైలు శిక్షతో పాటు ఆ చిత్ర నిర్మాణ వ్యయంలో 5 శాతం జరిమానా విధించాలని చట్టం చేశారు. ఈ ప్రతిపాదనకు పార్లమెంట్ లోని ఉభయ సభలు ఆమోదం తెలిపాయి. అలాగే సెన్సార్ సర్టిఫికెట్ ని వయసుల వారీగా విభజిస్తున్నట్లు మంత్రి అనురాగ్ ఠాకూర్ తెలిపారు. పైరసీ కారణంగా ప్రతి ఏటా చిత్ర పరిశ్రమ దాదాపు 20 వేల కోట్లు నష్టపోతోంది అని అనురాగ్ ఠాకూర్ అన్నారు.