ఏపీలో టికెట్ల రేట్ల ఇస్యూపై  నిర్మాత దిల్‌రాజు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఏపి ప్రభుత్వంతో చర్చలు జరిపేందుకు ఓ కమిటీని ఏర్పాటు చేస్తున్నట్టు తెలిపారు. అప్పటి వరకు స్టార్లు ట్వీట్లు చేయోద్దని తెలిపారు.

ఏపీలో టికెట్ల రేట్లకి సంబంధించిన సమస్యలను, ఇండస్ట్రీకి సంబంధించిన సమస్యలను పరిష్కరించడానికి ప్రభుత్వం ఓ కమిటీని ఏర్పాటు చేస్తుందని, ఆ కమిటీ రిపోర్ట్ పై ప్రభుత్వం నిర్ణయం తీసుకునేంత వరకు ఎవరూ ట్వీట్లు చేయోద్దని, ఈ వివాదంపై స్పందించవద్దని తెలిపారు నిర్మాత దిల్‌రాజు. ఏపీలో టికెట్ల రేట్లు తగ్గిస్తూ ప్రభుత్వం జీవో నెం.35ని తీసుకొచ్చిన విషయం తెలిసిందే. దీనిపై సర్వత్రా వ్యతిరేకత వ్యక్తమవుతుంది. తగ్గింపు టికెట్ రేట్లతో థియేటర్లు రన్‌ చేయలేమని స్వచ్ఛందంగా థియేటర్లని మూసేసుకుంటున్నారు ఎగ్జిబిటర్లు. దాదాపు 175కిపైగా థియేటర్లు మూత పడినట్టు సమాచారం. 

మరోవైపు టికెట్ల రేట్లకి సంబంధించి నాని ఇటీవల `శ్యామ్‌ సింగరాయ్‌` ప్రెస్‌మీట్‌లో స్పందించి కిరాణాషాప్‌ కౌంటర్‌ డబ్బుల కంటే థియేటర్లలో కౌంటర్‌ తక్కువగా ఉందని ఆయన కామెంట్‌ చేయడం దుమారం రేపింది. మరోవైపు సిద్ధార్థ్‌ సైతం దీనిపై ట్వీట్లు చేశారు. నిఖిల్‌ కూడా స్పందించారు. ఏదో సందర్భంలో ఇండస్ట్రీకి చెందిన వారు స్పందిస్తున్న నేపథ్యంలో వివాదం మరింతగా పెరుగుతుందని పలువురు తెలిపారు. ఈ నేపథ్యంలో నిర్మాత దిల్‌రాజు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఏపి ప్రభుత్వంతో చర్చలు జరిపేందుకు ఓ కమిటీని ఏర్పాటు చేస్తున్నట్టు తెలిపారు. 

ఆయన మాట్లాడుతూ, `ఏపీ ప్రభుత్వానికి ఇండస్ట్రీ సమస్యలు ప్రాపర్‌గా తెలియవు. వాటిని కరెక్ట్ గా వివరించాల్సిన అవసరం ఉంది. ప్రభుత్వం నుంచి తెలుగు ఫిల్మ్ ఛాంబర్‌ కి ఫోన్‌ వచ్చింది. సమస్యల పరిష్కారానికి ఓకమిటీ వేయాలనుకుంటున్నట్టు, అందుకోసం ఆయా విభాగాల నుంచి పేర్లని సూచించాలని కోరారు. అందుకు ఫిల్మ్ ఛాంబర్‌ వాళ్లు కొన్ని పేర్లు సూచించారు. ఇందులో ఎగ్జిబిటర్లు, డిస్ట్రిబ్యూటర్లు, నిర్మాతలతోపాటు ఇండస్ట్రీకి చెందిన ఇతర విభాగాల వారు కూడా సభ్యులుగా ఉంటారు. 

వీరంతా చర్చించి, ఇండస్ట్రీ సమస్యలు, నిర్మాతల సమస్యలు, థియేటర్ల సమస్యలు, టికెట్ల రేట్ల వంటి వాటిపై ప్రభుత్వానికి వివరించనున్నారు. దీని ప్రకారం త్వరలోనే ఏపీ ప్రభుత్వానికి సంబంధించి ఇండస్ట్రీలో నెలకొన్న సమస్యలకు పరిష్కారం లభిస్తుందని భావిస్తున్నాం. ఆశిస్తున్నాం. అప్పటి వరకు ఎవరూ దీనిపై ట్వీట్లు, కామెంట్లు చేయోద్దని కోరుకుంటున్నాం. కమిటీ నిర్ణయం తర్వాత దీని గురించి మాట్లాడతాం. కమిటీ చెప్పిన దానిపై ప్రభుత్వం ఎలా స్పందిస్తుంది, సమస్య పరిష్కారం కాకపోతే ఎలా రియాక్ట్ అవ్వాలనేది అందరం కలిసి ఆలోచిస్తాం. ఎలా ముందుకెళ్లాలనేదానిపై నిర్ణయం తీసుకుంటాం. 

అదే సమయంలో అపాయింట్‌మెంట్ ఇస్తే సీఎం జగన్‌ని కలిసేందుకు తాము సిద్దంగా ఉన్నాం. అపాయింట్మెంట్‌ రావాల్సి ఉంది. మా కోరికలు పెద్దవి కావు. మా సమస్యలను ప్రభుత్వం పరిష్కరిస్తుందని, త్వరలోనే మళ్లీ పాతరోజులొస్తాయని ఆశిస్తున్నాం. సినిమా అనేది చాలా సెన్సిటివ్‌ విషయం. ఈ విషయంలో మీడియా బ్యాలెన్స్ గా ఉండాలి. కాంట్రవర్సీలకు అతీతంగా ఉండాలని కోరుకుంటున్నాం. మేం మంచి సినిమాలను ఆడియెన్స్ కి అందించాలనే భావిస్తాం. ఆడియెన్స్ ని ఎంటర్‌టైన్‌మెంట్‌ ఇవ్వడమే మా లక్ష్యం` అని చెప్పారు దిల్‌రాజు. ఈ కార్యక్రమంలో నిర్మాతలు స్రవంతి రవికిశోర్‌, యూవీ క్రియేషన్స్ వంశీ పాల్గొన్నారు. 

also read: RRR in Shock & Suspense: `ఆర్‌ఆర్‌ఆర్‌`కి మరో షాక్‌.. చివరికి తెలంగాణ సర్కార్‌ కూడా.. డైలమాలో రాజమౌళి టీమ్‌