ఆఫర్స్ కోసం ఆఫీస్ లు చుట్టూ తిరిగినప్పుడు అవకాశాలు రావు. తనను తాను ప్రూవ్ చేసుకున్నప్పుడు ప్రపంచం మొత్తం వెనకబడుతుంది. తమ సినిమాల్లో చేయమని అడుగుతుంది. ఇప్పుడు అదే పరిస్దితి అడవి శేషుకు వచ్చింది. అతను అప్పట్లో రామ్ చరణ్ హీరోగా వచ్చిన ‘ఎవడు’  సినిమాలో విలన్ గా ట్రై చేసాడు. అయితే అప్పుడు వర్కవుట్ కాలేదు. కానీ ఇప్పుడు ‘ఎవరు’తో అదే బ్యానర్ లో  ఆఫర్ వచ్చింది. ఈ విషయాన్ని అడవి శేషు స్వయంగా మీడియాతో చెప్పుకొచ్చారు. 

అడవి శేష్‌, రెజీనా, నవీన్‌ చంద్ర కీలక పాత్రధారులుగా వెంకట్‌ రామ్‌జీని దర్శకుడిగా పరిచయం చేస్తూ, పీవీపీ నిర్మించిన ‘ఎవరు’ చిత్రాన్ని నైజాంలో ‘దిల్‌’ రాజు విడుదల చేశారు.  మీడియా సమావేశంలో ‘‘దిల్‌ రాజు నిర్మించిన ‘ఎవడు’ సినిమాలో విలన్‌గా ట్రై చేశా. కుదరలేదు. ‘ఎవరు’ సినిమా చూసిన వెంటనే ‘మా బ్యానర్‌లో సినిమా ఎప్పుడు చేస్తున్నావ్‌’ అని కాల్‌ చేశారు. ఆయన ప్రశంసలతో రెట్టింపు ఉత్సాహం పెరిగింది’’ అని అడివి శేష్‌ అన్నారు. 

దిల్ రాజు మాట్లాడుతూ ‘‘ఇన్ని ట్విస్ట్‌లతో ఈ మధ్యకాలంలో ఇంతగా ఉత్కంఠకు గురి చేసిన సినిమా రాలేదు. స్ర్కీన్‌ప్లే అద్భుతంగా ఉంది’’ అని అన్నారు. ‘‘ప్రతిభ ఉంటే ఇండస్ట్రీలో ఎలాంటి నేపథ్యం లేకపోయినా రాణించవచ్చు. అడవి శేష్‌ సాధిస్తున్న విజయాలే అందుకు నిదర్శనం. కథల విషయంలో ఆచితూచి అడుగెస్తూ ఒక్కో మెట్టు ఎక్కుతున్నాడు. ఇలాంటి కథేమన్నా ఉంటే మా బ్యానర్‌లో అతనితో సినిమా చేస్తా’’ అని ‘దిల్‌’ రాజు అన్నారు.