డిస్ట్రిబ్యూటర్ స్థాయి నుంచి టాలీవుడ్ లో తిరుగులేని నిర్మాత స్థాయికి దిల్ రాజు చేరుకున్నారు. దిల్ రాజు ఎంచుకునే కథల విషయంలో సక్సెస్ శాతం ఎక్కువగా ఉంటుంది. చిన్న సినిమా చేసినా, పెద్ద చిత్రాన్ని నిర్మించినా రాజుగారి లెక్క తప్పిన సందర్భాలు చాలా తక్కువ. అందుకు ఈ 20 ఏళ్ల కాలంలో టాలీవుడ్ లో అగ్ర నిర్మాతల స్థాయికి చేరుకున్నాడు. 

దిల్ రాజు చిత్ర పరిశ్రమలో తన ప్రయాణాన్ని ప్రారంభించి 20 ఏళ్ళు పూర్తయింది. ఈ సందర్భంగా దిల్ రాజు ఇటీవల మీడియా సమావేశం కూడా నిర్వహించారు. టాలీవుడ్ లో తన పరిధిని విస్తరించేందుకు దిల్ రాజు మాస్టర్ ప్లాన్ వేశారు. ఓ ఇంటర్వ్యూలో తన ప్లాన్ ని బయట పెట్టారు. 

చిత్ర పరిశ్రమలోకి వచ్చి 20 ఏళ్ళు గడిచింది. తదుపరి మీ ప్లాన్ ఏంటి అని ప్రశ్నించగా.. 8 మంది నిర్మాతలతో ఓ అద్భుతమైన ఆలోచన చేస్తున్నాం. వాళ్ళతో ఇప్పటికే ఒప్పందం కూడా జరిగింది. వారు సినిమా చేయాలనుకుంటే నా దగ్గరకు వచ్చి కథ వినిపిస్తారు. కథ నచ్చితే నేను ఒకే చేస్తా. ఆ చిత్రానికి వారే నిర్మాతగా ఉంటారు. కానీ నేను మాత్రం ఫైనాన్సియల్ గా సపోర్ట్ చేస్తా. 

సినిమాని ఎలా రిలీజ్ చేయాలి, ప్రమోషన్స్ లాంటి విషయంలో ప్లానింగ్ నాదే. ప్రొడక్షన్ మొత్తం వాళ్ళే చూసుకుంటుంటారు. నేను నా సినిమాలతో బిజీగా ఉంటా. ఫైనాన్సియల్ సపోర్ట్, ప్లానింగ్ మాత్రం నాది. ఇలా 8 మంది నిర్మాతలు ఏడాదికి 10 సినిమాలు చేశారనుకోండి.. అందులో 5 విజయం సాధించినా చాలు.. మాకు ఎలాంటి నష్టం ఉండదు. 

నిర్మాతగా అన్ని చిత్రాలని నేనే నిర్మించలేను. వారి వద్దకు మంచి కథలేవైనా వస్తే నాకు వినిపిస్తారు. ఈ ప్లాన్ వర్కౌట్ అయితే భవిష్యత్తులో నిర్మాతల సంఖ్య కూడా పెరుగుతుందని దిల్ రాజు తెలిపారు. కథల జడ్జిమెంట్ విషయంలో దిల్ రాజుకు మంచి అనుభవం ఉంది. అందుకే ఆ నిర్మాతలంతా ఈ డీల్ కు ఒప్పుకున్నారట. టాలీవుడ్ లో ఇలాంటి బిజినెస్ డీల్ కుదరడం ఇదే తొలిసారి. నిజంగా ఇది సూపర్బ్ ఐడియా.