`వారసుడు` ట్రైలర్‌ చూశాక ఇది తెలుగులో వచ్చిన `అజ్ఞాతవాసి`, `బ్రహ్మోత్సవం`, `అలా వైకుంఠపురములో` వంటి సినిమాలను పోలి ఉందనే కామెంట్లపై దిల్‌రాజు బోల్డ్ స్టేట్‌మెంట్‌ ఇచ్చారు.

నిర్మాత దిల్‌రాజు నిర్మించిన `వారసుడు` చిత్రం వాయిదా పడిన విషయం తెలిసిందే. ఈ నెల 11న విడుదల కావాల్సిన ఈ చిత్రం జనవరి 14కి వాయిదా వేశారు. చిరంజీవి, బాలకృష్ణ సినిమాల కోసం వాయిదా వేసినట్టు చెప్పిన విషయం తెలిసిందే. తన సినిమాపై నమ్మకంతా వెనక్కి తగ్గినట్టు చెప్పారు. గతంలో తాను చేసిన `సీతామ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు`, `శతమానం భవతి` వంటి చిత్రాలు సంక్రాంతికి వచ్చి పెద్ద హిట్‌ అయ్యాయని, ఇప్పుడు `వారసుడు` కూడా అలానే హిట్‌ అవుతుందని, ఆడియెన్స్‌ ఆదరణ పొందుతుందని నమ్ముతున్నట్టు చెప్పారు. 

ఈ సందర్భంగా మరో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. `వారసుడు` ట్రైలర్‌ చూశాక ఇది తెలుగులో వచ్చిన `అజ్ఞాతవాసి`, `బ్రహ్మోత్సవం`, `అలా వైకుంఠపురములో` వంటి సినిమాలను పోలి ఉందని, అవన్నీ మిక్స్ చేసిన మిక్చర్‌ పొట్లంలా ఉందనే ప్రశ్న దిల్‌రాజు కి ఎదురయ్యింది. దీనిపై దిల్‌రాజు స్పందించారు. ఇలా ఉందనే విషయం తనకు కథ విన్నప్పుడే కలిగిందట. అన్నీ తెలిసే తాను ఈ సినిమా చేశానని తెలిపారు దిల్‌రాజు. 

అయితే ఈ సినిమా ద్వారా ఓ కొత్త పాయింట్‌ని చెప్పబోతున్నామన్నారు. అది సర్ప్రైజింగ్‌గా ఉంటుందన్నారు. అంతేకాదు ఫ్యామిలీ ఎమోషన్స్, కామెడీ, ఫైట్స్, సెంటిమెంట్‌, హీరోయిజం ఇలా అన్ని మేళవింపుగా ఉంటుందని, చూస్తున్నంత సేపు ఎంగేజింగ్‌గా సాగుతుంది. ఎమోషన్‌ క్యారీ అవుతుందని, ఎక్కడ బోర్‌ ఫీలింగ్ ఉండదన్నారు. సినిమా చూస్తున్నంత సేపు రెండున్నర గంటలు ఆడియెన్స్ ని ఎంగేజ్‌ చేసిందా లేదా అనేది ముఖ్యమని ఆ అంశాలు ఈ చిత్రంలో ఉన్నాయన్నారు. 

తెలుగులో నిర్మించకపోవడంపై దిల్‌రాజు స్పందిస్తూ, మొదట తెలుగు, తమిళంలో బైలింగ్వల్‌ గా చేయాలని అనుకున్నామని, కానీ విజయ్‌ తమిళంలోనే చేయండి అని చెప్పడంతో వెనక్కి తగ్గామని తెలిపారు. డబ్బింగ్‌ సినిమాలైనా కథ బాగుంటే ఆదరణ పొందుతాయన్నారు దిల్‌రాజు. ఫిబ్రవరిలోనూ `శాకుంతలం`తోపాటు ఇతర సినిమాలో పోటీపడుతున్నాయనే ప్రశ్నకి, ఆ రోజు కూడా మాట్లాడుకుని సెట్‌ చేసుకుంటామన్నారు. దీంతోపాటు ట్రైలర్లు చూసి బిజినెస్‌ జరిగే రోజులు పోయాయని తెలిపారు దిల్‌రాజు. హీరోల క్రేజ్‌మీదనే సినిమా వ్యాపారం జరుగుతుందన్నారు. 

వంశీపైడిపల్లి దర్శకత్వంలో విజయ్‌ హీరోగా రూపొందిన `వారసుడు` చిత్రంలో రష్మిక మందన్నా కథానాయికగా నటించింది. దీన్ని శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పై దిల్‌రాజు భారీ బడ్జెట్‌తో నిర్మించారు. ఈసినిమా తమిళంలో ఈ నెల 11నే విడుదల కానుంది. తెలుగులో మాత్రం 14కి వాయిదా పడింది.