సందీప్ కిషన్ `మైఖేల్`పై ఓవర్ కాన్ఫిడెన్స్ బెడిసి కొట్టిందా?.. పాన్ ఇండియా ప్రయోగం అట్టర్ ఫ్లాప్?
`మైఖేల్`ని పాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కించినా దీనికి రిలీజ్‌కి ముందు ఎలాంటి బజ్ క్రియేట్ కాలేదు. థియేటర్లలోకి వచ్చిన ఈ సినిమాకి ఫస్ట్ షో నుంచి నిరాశే ఎదురయ్యింది.

యంగ్ హీరో సందీప్ కిషన్ ఇటీవల `మైఖేల్` చిత్రంతో ఆడియెన్స్ ముందుకొచ్చారు. గ్యాంగ్ స్టర్ కథ నేపథ్యంలో రూపొందిన పీరియాడికల్ మూవీ ఇది. రంజిత్ జయకోడి అనే తమిళ దర్శకుడు రూపొందించారు. ఏసియన్ సినిమాస్ నిర్మించారు. పాన్ ఇండియా మూవీగా తెరకెక్కింది. తెలుగు, తమిళంలో ఏకకాలంలో షూటింగ్ చేయగా, కన్నడ, హిందీ, మలయాళంలో డబ్ చేసి పాన్ ఇండియా స్థాయిలో విడుదల చేశారు.
`మైఖేల్`ని పాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కించినా దీనికి రిలీజ్‌కి ముందు ఎలాంటి బజ్ క్రియేట్ కాలేదు. దీనికితోడు ప్రీ రిలీజ్ బిజినెస్ కూడా లాస్‌లోనే ఉందట. థియేటర్లలోకి వచ్చిన ఈ సినిమాకి ఫస్ట్ షో నుంచి నిరాశే ఎదురయ్యింది. పీరియాడికల్ యాక్షన్ మూవీగా తెరకెక్కించినా ఆడియెన్స్ పెద్దగా పట్టించుకోలేదు. అందుకు కారణంగా సినిమాలో ఒరిజినాలిటీ మిస్ అయ్యింది. సోల్, ఎమోషన్స్ మిస్ అయ్యాయి. లవ్ స్టోరీ ఉన్నా అందులో ఫీల్ లేదు. దీంతో ఆడియెన్స్ రిజక్ట్ చేశారు. తెలుగులో అంతో ఇంతో బెటర్‌గానీ, ఇతర భాషల్లో మాత్రం పట్టించుకునే ఆడియెన్స్ లేకపోవడం గమనార్హం.
గ్యాంగ్ స్టర్ ప్రధానంగా సాగే ఈ చిత్రంలో లవ్ స్టోరీని ఇరికించారు. కానీ అది వర్కౌట్ కాలేదు. దీనికితోడు ఈ సినిమాని చూస్తుంటే అనేక పాత సినిమాలు గుర్తుకొస్తుంటాయి. సినిమా ఫ్లేవర్ మొత్తం `కేజీఎఫ్`లా ఉంటుంది. సందీప్ కిషన్ ఎదిగిన తీరు మొత్తం `కేజీఎఫ్` స్క్రీన్‌ప్లేలో ఉంటుంది. క్లైమాక్స్ `విక్రమ్`ని పోలి ఉంటుంది. ఇంకా చెప్పాలంటే సీన్ బై సీన్ లేపేసినట్టే ఉంటుంది. దీంతోపాటు కొన్ని `పుష్ప` సీన్లు, అలాగే హిందీ మూవీ `దీవార్`, పలు హాలీవుడ్ చిత్రాలను ఇందులో దించేశారు. థియేటర్ నుంచి బయటకు వచ్చిన ఆడియెన్స్ సైతం ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు.
దీంతో ఆయా సినిమాల్లో సందీప్ కిషన్ చేసినట్టు ఉంటుంది తప్ప, ఒరిజినాలిటీ మిస్ అయ్యింది. ఇదే సినిమాకి పెద్ద మైనస్. అంతేకాదు, సినిమాలో బ్యాక్ గ్రౌండ్ వాయిస్ మైఖేల్ గురించి ఆహో ఓహో అనే రేంజ్‌లో చెబుతుంటారు. కానీ పాత్రలో అంత ఈజ్ లేదు, అంత హీరోయిజం లేదు. పాత్రకి తగ్గట్టుగా సందీప్ కిషన్ సెట్ కాలేదనే అభిప్రాయం ఆడియెన్స్ నుంచి వస్తోంది. అయితే యూనివర్సల్ కాన్సెప్ట్ కావడం, ఇటీవల ఇలాంటి నేపథ్య చిత్రాలు బాగా ఆదరణ పొందుతున్న నేపథ్యంలో సందీప్ ఇలాంటి సినిమా చేయాలనుకున్నారు. ఆయనదే ఈ ఐడియా, దర్శకుడు దాన్ని తగ్గట్టుగా కథని సిద్దం చేసుకొచ్చారు. సందీప్ కిషన్‌కి కావాల్సిన విధంగా సినిమాని తెరకెక్కించారు. అయితే ఇందులో సీన్లు తప్ప ఎమోషన్స్ లేదని, సోల్ మిస్ అయ్యిందని పెదవి విరిచారు. దీంతో సందీప్ ప్రయోగం తలక్రిందులైందనే అభిప్రాయం వ్యక్తమవుతుంది.
నిజానికి సందీప్ కిషన్‌కి `వెంకటాద్రి ఎక్స్ ప్రెస్` స్థాయి హిట్ ఇప్పటి వరకు పడలేదు. కెరీర్ పరంగా బ్రేక్ లేదు, వరుసగా సినిమాలు చేసుకుంటూ కెరీర్‌ని లాక్కొస్తున్నాడు. `ఏ1ఎక్స్ ప్రెస్`, `నిను వీడని నీడను నేనే` చిత్రాలు ఉన్నంతలో బెటర్. కానీ సరైన హిట్ లేని సందీప్ ఇప్పుడు ఏకంగా పాన్ ఇండియా ప్రయోగం చేయడం అందరిని ఆశ్చర్యపరిచింది. కథ కుదిరి కంటెంట్ పరంగా అది పాన్ ఇండియా సినిమా అవ్వాలి గానీ, బలవంతంగా చేస్తే కాదనే అభిప్రాయం అటు సోషల్ మీడియా, ఇటు జనరల్ ఆడియెన్స్ నుంచి వినిపిస్తుంది. దీంతో సందీప్ కిషన్ పాన్ ఇండియా ప్రయోగం అట్టర్ ఫ్లాప్ షోగా నిలిచింది.
ఇదిలా ఉంటే సినిమా ప్రమోషన్‌లో భాగంగా సందీప్ కిషన్ మాట్లాడుతూ, సినిమాపై తన నమ్మకాన్ని వెల్లడించారు. ఇంకా చెప్పాలంటే ఓవర్ కాన్ఫిడెంట్‌గా ఉన్నారు. ఈ సినిమా ఫ్లాప్ అవ్వడం అసాధ్యమన్నారు. ఎంత లీస్ట్ గా అయినా యావరేజ్ అవుతుందని, ఫ్లాప్ అయ్యే ప్రస్తకే లేదన్నారు. కానీ సినిమా రిజల్ట్ అందుకు పూర్తి భిన్నంగా ఉండటం గమనార్హం. ఈ సినిమాకి సుమారు పది కోట్ల వరకు ఖర్చు చేశారట. విజయ్ సేతుపతి, గౌతమ్ మీనన్, వరలక్ష్మి వంటి భారీ కాస్టింగ్‌తో తీశారు. ప్రీ రిలీజ్ బిజినెస్ ఐదారు కోట్లే అట, ఓటీటీ రైట్స్ కోటికిపోయాయని టాక్. ఇక కలెక్షన్లు చూస్తే సినిమా సుమారు పది కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసినట్టు ప్రకటించింది యూనిట్. కానీ వాస్తవంగా ఐదారు కోట్ల వద్దే ఆగిపోయిందని టాక్. అందుకే టీమ్ నుంచి దీనికి సంబంధించి ఎలాంటి సౌండ్‌లేదని అంటున్నారు. ఏదేమైనా ఇంట గెలిచి రచ్చ గెలవాలంటారు. కానీ సందీప్ ఇంట గెలవకుండానే రచ్చ గెలిచే ప్రయత్నం చేశారు. బోల్తా పడ్డారని చెప్పడంలో అతిశయోక్తి లేదు. ఇకపై ఆయన కంటెంట్ ప్రధానమైన సినిమాలు చేస్తే బాగుంటుందనే అభిప్రాయం ఆడియెన్స్ నుంచి ఆయన అభిమానుల నుంచి వినిపిస్తుంది.