తమిళ నటుడు ధనుష్ తల్లిదండ్రులమంటూ వచ్చిన పిటిషన్ పై విచారణ ధనుష్ పుట్టుమచ్చలు లేజర్ ట్రీట్ మెంట్ తో చెరిపేసుకున్నాడన్న వైద్యులు తనను పెంచిన కస్తూరి రాజే తన తండ్రని చెప్తున్న ధనుష్ కదిరేశన్ దంపతులతో తనకు సంబంధం లేదని స్పష్టం చేస్తున్న ధనుష్

తమిళ సినీ హీరో ధనుష్‌ తమ కుమారుడేనన్న పిటిషన్‌పై న్యాయస్థానంలో వాదనలు ముగిసాయి. ధనుష్‌ తమ కుమారుడేనంటూ మద్రాస్‌ హైకోర్టు మధురై బెంచ్‌లో కదిరేశన్‌, మీనాక్షి దంపతులు పిటిషన్‌ దాఖలు చేసిన విషయం తెలిసిందే. కేసు తోసి పుచ్చాలని ధనుష్‌ తరఫు న్యాయవాది విజ్ఞప్తి చేశారు. ఇరు వర్గాల వాదనలు విన్న మద్రాస్‌ హైకోర్టు మధురై బెంచ్‌ తీర్పును రిజర్వ్‌లో ఉంచింది.


తమిళ సూపర్‌ స్టార్‌ రజనీకాంత్‌ అల్లుడు, స్టార్‌ హీరో ధనుష్‌ తమ కుమారుడేనని .. వృద్ధాప్యంలో ఉన్న తమకు మెయింటినెన్స్‌ కింద నెలకు రూ.65వేలు ఇప్పించాలని కదిరేశన్‌, మీనాక్షి దంపతులు కోర్టుకెక్కారు. హైకోర్టు ఆదేశాల మేరకు ధనుష్‌ను పరీక్షించిన ప్రభుత్వ వైద్యులు లేజర్‌ టెక్నాలజీ ద్వారా ఆయన తన శరీరంపై ఉన్న పుట్టుమచ్చలను చెరిపేసుకున్నాడని తేల్చారు. కదిరేశన్‌ దంపతులు కోర్టుకు సమర్పించిన పత్రాలు, ధనుష్‌ తరఫున దాఖలు చేసిన పత్రాలను కోర్టు క్షుణ్నంగా పరిశీలించింది. ధనుష్‌ నవంబర్‌ 7, 1985లో జన్మించాడని, అసలు పేరు కరైసెల్వన్‌ అని వృద్ధ దంపతులు కోర్టుకు తెలిపారు. ఇంటర్‌ చదువుతున్న సయంలో ఇంటి నుంచి పారిపోయి చెన్నై వెళ్లిపోయాడని, 2002లో పేరు మార్చుకున్నాడని, ధనుష్‌ చిన్ననాటి ఫోటోలు కూడా విడుదల చేశారు.


అయితే ధనుష్‌ మాత్రం కదిరేషన్‌ దంపతులు చెప్పిన దాంట్లో నిజం లేదని కొట్టిపారేశారు. తన నుంచి డబ్బు గుంజేందుకే కేసులు వేస్తున్నారని ఆరోపించారు. తనను పెంచిన కస్తూరి రాజే తన తండ్రి అని కోర్టుకు స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో మద్రాస్‌ హైకోర్టు మధురై బెంచ్‌ వెలువరించే తీర్పుపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.