హీరో ధనుష్‌ కమర్షియల్‌ హీరోగానే కాదు ప్రయోగాత్మక నటుడుగానూ పేరు, గుర్తింపు తెచ్చుకున్నారు. పాత్రలో పరకాయ ప్రవేశం చేయడంలో ఆయనకు ఆయనే సాటి అనిపించుకుంటున్నారు. గతేడాది `అసురన్‌` చిత్రంలో కుర్రాడిగా, పెద్ద వయస్కుడిగా నటించి మెప్పించాడు. భారీ బ్లాక్‌ బస్టర్‌ని అందుకున్నారు. 

రెండేళ్ళ క్రితం `ది ఎక్‌టార్డినరీ జర్నీ ఆఫ్‌ ది ఫకీర్‌` చిత్రంలో మెయిన్‌ రోల్‌లో మెరిసాడు ధనుష్‌. ఈ సినిమా ద్వారా మంచి పేరుతో సంపాదించాడు. తాజాగా మరో ఇంగ్లీష్‌ చిత్రంలో నటించబోతున్నాడు. `అవేంజర్‌ః ఎండ్‌ గేమ్‌` దర్శకుడు రుస్సో బ్రదర్స్ రూపొందించబోతున్న `ది గ్రే మ్యాన్‌` చిత్రంలో కీలక పాత్రలో నటించే అరుదైన అవకాశాన్ని సొంతం చేసుకున్నారు. 

ఇందులో క్రిష్‌ ఇవాన్స్, రేయన్‌ గోస్లింగ్‌, అనా డె అర్మాస్‌ ప్రధాన పాత్రలు పోషిస్తుండగా, వారితోపాటు ధనుష్‌ కీలక పాత్ర పోషించనున్నారు. ఇది స్పై థ్రిల్లర్‌గా రూపొందనుంది. 200 మిలియన్‌ బడ్జెట్‌తో ఈ సినిమా రూపొందనుందట. అంతేకాదు మార్క్ గ్రీనేస్‌ నవల ఆధారంగా దీన్ని రూపొందిస్తున్నారు. అయితే ఇది డైరెక్ట్ గా నెట్‌ఫ్లిక్స్ లో విడుదల కాబోతుండటం గమనార్హం. ప్రస్తుతం ధనుష్‌ హిందీలో `అట్రాంగి రే` చిత్రంలో, తమిళంలో `జగమే తంతిరమ్‌`, `కర్ణన్‌` చిత్రాల్లో నటిస్తున్నాడు.