Asianet News TeluguAsianet News Telugu

రివ్యూ: దేవదాస్

తన చరిష్మాతో ఆకట్టుకునే అక్కినేని నాగార్జున, ఎలాంటి పాత్రలోనైనా అవలీలగా నటించే నేచురల్ స్టార్ నాని.. వీరిద్దరూ ఒకే సినిమా నటిస్తున్నారని తెలిసినప్పటి నుండి సినిమాపై అంచనాలు పెరిగిపోయాయి. ఆ కథకు 'దేవదాస్' అనే టైటిల్ పెట్టి అంచనాలను మరింత పెంచేశారు.

devadas telugu movie review
Author
Hyderabad, First Published Sep 27, 2018, 12:45 PM IST

న‌టీన‌టులు: నాగార్జున అక్కినేని, నాని, ర‌ష్మిక మందాన్న‌, ఆకాంక్ష సింగ్, కునాల్ కపూర్, శరత్ కుమార్, రావు ర‌మేష్, వెన్నెల కిషోర్, అవ‌స‌రాల శ్రీ‌నివాస్ తదితరులు
సంగీతం: మ‌ణిశ‌ర్మ సాంకేతిక విభాగం:
నిర్మాత‌: అశ్వినీద‌త్
సంస్థ‌లు: వైజయంతి మూవీస్ మ‌రియు వ‌యాక‌మ్ 18 మీడియా ప్రైవేట్ లిమిటెడ్ 
ద‌ర్శ‌కుడు: శ్రీ‌రామ్ ఆదిత్య‌

తన చరిష్మాతో ఆకట్టుకునే అక్కినేని నాగార్జున, ఎలాంటి పాత్రలోనైనా అవలీలగా నటించే నేచురల్ స్టార్ నాని.. వీరిద్దరూ ఒకే సినిమా నటిస్తున్నారని తెలిసినప్పటి నుండి సినిమాపై అంచనాలు పెరిగిపోయాయి. ఆ కథకు 'దేవదాస్' అనే టైటిల్ పెట్టి అంచనాలను మరింత పెంచేశారు. మరి ఈరోజు ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ దేవదాస్ ఆడియన్స్ అంచనాలను ఎంతవరకు అందుకోగలిగిందో.. సమీక్షలోకి వెళ్లి తెలుసుకుందాం!

కథ: 
దాదా(శరత్ కుమార్) పోలీసులకు దొరక్కుండా కాపాడతాడు ఓ చిన్న కుర్రాడు. దీంతో అతడిని తన సొంత కొడుకు కంటే ఎక్కువగా చూసుకుంటాడు. అతడే దేవ(నాగార్జున). దేవ అండతో సిటీ మొత్తాన్ని తన కంట్రోల్ లో తీసుకుంటాడు దాదా. అయితే దేవ ఎలా ఉంటాడనే విషయం ఎవరికీ తెలియదు. పోలీసులు కూడా అతడిని వెతుకుతుంటారు. ఇంతలో దేవ ప్రత్యర్దుల్లో ఒకడైన డేవిడ్(కునాల్ కపూర్) దాదాని చంపేస్తాడు. అలా దేవాని బయటకి తీసుకురావొచ్చనేది  డేవిడ్ ప్లాన్.

సిటీలోకి ఎంటర్ అయిన దేవ.. తన దాదాని చంపడానికి కారకులైన ప్రతి ఒక్కరిని చంపుతూ ఉంటాడు. మరోపక్క దాస్(నాని) డాక్టర్ చదువు పూర్తి చేసుకొని ఓ కార్పరేట్ హాస్పిటల్ లో డాక్టర్ గా జాయిన్ అవుతాడు. అతడి అతి మంచితనం కారణంగా ఉద్యోగం పోతుంది. దీంతో తన గల్లీలోనే ఓ క్లినిక్ లో పని చేస్తుంటాడు. ఓ రోజు బుల్లెట్ గాయంతో దేవ.. దాస్ క్లినిక్ వస్తాడు. అతడికి ట్రీట్మెంట్ చేసి బతికిస్తాడు దాస్.

అప్పటినుండి దేవ.. దాస్ ని నమ్మడం మొదలుపెడతాడు. ప్రతిదానికి బయటపడే దాస్.. దేవ డాన్ అని తెలిసినా.. అతడితో స్నేహం చేస్తాడు. దాస్ తో స్నేహం దేవ జీవితంలో ఎలాంటి మార్పులు తీసుకొచ్చింది..? దేవాని చంపాలనుకునే డేవిడ్ ని అతడు ఎలా ఎదుర్కొంటాడు..? రష్మిక, ఆకాంక్ష సింగ్ ల పాత్రలు ఎలా ఉండబోతున్నాయి..? అనే విషయాలు సినిమా చూసి తెలుసుకోవాల్సిందే!

devadas telugu movie review

విశ్లేషణ: 
తెలుగులో మల్టీస్టారర్ సినిమాలు ప్రేక్షకాదరణ దక్కించుకుంటున్నాయి. ఈ క్రమంలో వచ్చిన 'దేవదాస్' సినిమాపై మంచి అంచనాలే ఏర్పడ్డాయి. అయితే రెండు సినిమాల అనుభవం ఉన్న శ్రీరాం ఆదిత్య లాంటి దర్శకుడు నాగార్జున లాంటి సీనియర్ నటుడిని, నాని లాంటి నేచురల్ స్టార్ ని ఎలా హ్యాండిల్ చేసి ఉంటాడనే అనుమానాలు ఉండేవి. కానీ ఈ సినిమా చూసిన తరువాత ఆ అనుమానాలన్నీ పటాపంచలు అయిపోతాయి. నిజానికి సినిమాలో చెప్పుకోవడానికి పెద్ద కథేమీ లేదు. కానీ చిన్న లైన్ ని కూడా ఎంతో  ఎంటర్టైనింగ్ గా చిత్రీకరించి ఆడియన్స్ ని ఆకట్టుకున్నాడు శ్రీరాం ఆదిత్య.

దేవ, దాస్ పాత్రల పరిచయ సన్నివేశాలు, వారిద్దరి మధ్య స్నేహం ఇలా ఫస్ట్ హాఫ్ అంతా సమయం తెలియకుండా గడిచిపోతుంది. మెయిన్ క్యారెక్టర్ల మధ్య నడిచే సన్నివేశాలు సినిమాలు ప్రధాన ఆకర్షణ. ఇద్దరూ కలిసి కూర్చొని మందు కొట్టే సీన్స్ బాగా నవ్విస్తాయి. ఇంటర్వెల్ బ్యాంగ్ చిన్న ట్విస్ట్ తో ముగుస్తుంది. సెకండ్ హాఫ్ లో సినిమా కాస్త స్లో అయినట్లుగా అనిపిస్తుంది. ఫస్ట్ హాఫ్ లో పేలినన్ని జోక్స్ సెకండ్ హాఫ్ లో కనిపించవు. దేవ, దాస్ లు విడిపోయినప్పుడు.. దాస్ చెప్పే డైలాగులు మెప్పిస్తాయి. క్లైమాక్స్ లో సైతం కామెడీ పెట్టి ఆడియన్స్ ని బాగా ఎంటర్టైన్ చేశారు.

devadas telugu movie review

కాస్టింగ్‌ పరంగా దర్శకుడు శ్రీరాం ఆదిత్య బాగా స్కోర్‌ చేశాడు. ఇద్దరి హీరోలకి ఎవరికి సూటయ్యే పాత్రలు వారికిచ్చాడు. సినిమాలో ఎవరూ కూడా మిస్‌ కాస్ట్‌ అనిపించరు. పైగా సినిమా అంతా తామే మోయాల్సిన భారం లేకపోయే సరికి అందరూ చాలా ఈజ్‌తో నటించారు. నాగార్జున చరిష్మా ముందు నాని తన నేచురల్ పెర్ఫార్మన్స్ తో ఎంతగా ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నా.. తెరపై నాగార్జున డామినేషన్ ఓ రేంజ్ లో ఉంది. నాగార్జునపై ఎలివేషన్ షాట్స్ బాగా పండాయి. అతడి కాస్ట్యూమ్స్, డైలాగ్స్ తో నవ్వించే తీరు మెప్పించింది. భయస్థుడైన డాక్టర్ పాత్రలో నాని జీవించేశాడు.

ముఖ్యంగా 'డాక్టర్ దాస్ ఎంబిబిఎస్ గోల్డ్ మెడలిస్ట్' అంటూ నాని డైలాగ్ చెప్పే ప్రతిసారి కామెడీ పండింది. నాని, కమెడియన్ సత్యల కామెడీ ట్రాక్ బాగుంది. రష్మిక పాత్రకి పెద్దగా ప్రాముఖ్యత లేదు. ఆకాంక్ష సింగ్ లుక్స్ పరంగా ఆకట్టుకుంది. సినిమా గ్లామర్ కోసం ఈ ఇద్దరి హీరోయిన్ల పాత్రలు ఉన్నాయి. విలన్ గా కునాల్ కపూర్ బాగానే నటించాడు. వెన్నెల కిషోర్ ఒకట్రెండు సీన్స్ లో కనిపించి నవ్వించారు.

మణిశర్మ సంగీతం సినిమాకు ప్రధాన ఆకర్షణ. నాగార్జున తెరపై కనిపించే ప్రతిసారి వచ్చే నేపధ్య సంగీతం బాగుంది. సినిమాటోగ్రఫీ మరో అసెట్.  సాంకేతిక విలువలు ఈ సినిమాను ఉన్నతంగా నిలబెట్టాయి. తక్కువ ఖర్చుతో మంచి అవుట్‌పుట్‌ తీసుకొచ్చినందుకు దర్శకుడిని, టెక్నీషియన్స్‌ని అభినందించాలి. కామెడీ, ఎమోషన్, లవ్, యాక్షన్ ఇలా అన్ని అంశాలు కలగలిపిన ఈ సినిమా ప్రతి ఒక్కరినీ మెప్పించడం ఖాయం. 

రేటింగ్: 2.75/5

Follow Us:
Download App:
  • android
  • ios