సౌత్ ఇండియాలో తెరకెక్కుతున్న ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్స్ గా ఆర్ ఆర్ ఆర్ మరియు కెజిఎఫ్ 2 ఉన్నాయి. ఈ రెండు చిత్రాలకు దేశవ్యాప్తంగా భారీ డిమాండ్ ఉంది. 2018లో వచ్చిన కెజిఎఫ్ చిత్రానికి సీక్వెల్ గా కెజిఎఫ్ 2 చేస్తుండగా, ఎన్టీఆర్, చరణ్ వంటి టాప్ స్టార్స్ తో రాజమౌళి పీరియాడిక్ యాక్షన్ డ్రామాగా ఆర్ ఆర్ ఆర్ తెరకెక్కిస్తున్నారు. ప్రశాంత్ నీల్ కెజిఎఫ్ 2 మూవీని ప్రకటించిన రెండేళ్లలో చకచకా పూర్తి చేశారు. లాక్ డౌన్ ముందు వరకు కెజిఎఫ్ 2 షూటింగ్ నిరవధికంగా సాగింది. కేవలం 20రోజుల షూట్ మాత్రమే మిగిలి ఉండగా ప్రశాంత్ నీల్ ఈ చిత్ర షూటింగ్ తిరిగి ప్రారంభించారు. నిన్న ప్రధాన పాత్రలపై కీలక సన్నివేశాలు తెరకెక్కించడం జరిగింది. 

సినిమాలో ప్రధాన విలన్ గా చేస్తున్న సంజయ్ దత్ అమెరికా నుండి తిరిగి వచ్చి షూటింగ్ లో పాల్గొంటే నెలరోజల్లో కెజిఎఫ్ 2 షూటింగ్ పార్ట్ ప్రశాంత్ నీల్ పూర్తి చేయనున్నారు. మరి ఈ విషయంలో రాజమౌళి చాల వెనుకబడిపోయారు. దాదాపు ఒకే సారి ఈ రెండు చిత్రాల షూటింగ్ మొదలుకాగా ఆర్ ఆర్ ఆర్ మాత్రం కేవలం 70 శాతం మాత్రమే పూర్తి అయ్యింది. ఆర్ ఆర్ ఆర్ షూటింగ్ విషయంలో అనేక అవాంతరాలు ఎదురయ్యాయి. షూటింగ్ సవ్యంగా సాగలేదు. ఇక అంతా కుదుటపడింది త్వరగా పూర్తి చేద్దాం అనుకుంటున్న సమయంలో లాక్ డౌన్ దెబ్బేసింది. 

కెజిఎఫ్ 2 చెప్పిన సమయానికి ఓ నెల అటోఇటో విడుదల కానుంది. ఆర్ ఆర్ ఆర్ విడుదలపై అసలు స్పష్టత లేదు. ఆర్ ఆర్ ఆర్ షూట్ అసలు ఎప్పుడు మొదలవుతుందో కూడా తెలియని పరిస్థితి. దీనితో రాజమౌళిపై ఒత్తిడి పెరిగిపోతుంది. 2020 జులై నుండి 2021 జనవరికి ఈ చిత్ర విడుదల వాయిదా వేయగా, అది ఇప్పుడు ఏ డేట్ కి వెళుతుందో చెప్పలేం. సమయం గడిచే కొద్ది నిర్మాత ఒత్తిడి చేస్తుండగా, రాజమౌళికి టెన్షన్ ఎక్కువైపోతోంది. మరి చూడాలి రాజమౌళి ఈ సమస్య నుండి ఎలా బయటపడతారో.